కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 12 : సర్కారు దవాఖానాకు వచ్చే గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన సేవలందించి నమ్మకం పెంచాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌జైన్ సూచించారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికలు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. దవాఖానలో సాధారణ కాన్పుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రోగితో మర్యాదపూర్వకంగా ఉండడంతోపాటుగా వారికి నాణ్యమైన సేవలందించాలని సూచించారు. బ్లడ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు.
దవాఖానలో కాన్పు అయిన మహిళకు కేసీఆర్ కిట్ అందించారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది ఆయన ఘనంగా సత్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కల్వకుర్తి దవాఖానలో పది రోజుల కిందట బాలింత మృతి చెందడంపై వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు రమేశ్చంద్ర, వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.