వనపర్తి టౌన్, ఏప్రిల్ 10 : జిల్లా కేంద్రంలో ఉన్న రామాలయాల్లో రాములోరి లగ్గం ఘనంగా జరిగింది. ముందుగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను అలంకరించి పట్టువస్ర్తాలు, కంకణాధారణ, తలంబ్రాలతో కల్యాణ ఘట్టాన్ని కనుల పండువగా జరిపారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి వేడుకను తిలకించి తన్మయత్వం చెందారు. రాజనగరం రామాలయం, బాలానగర్, రాంనగర్లో ఉన్న రామాలయాల్లో జరిగిన వేడుకలకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సతీమణి వాసంతితో కలిసి తలంబ్రాలు సమర్పించారు. శ్రీరాముడి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే సింగిరెడ్డి వాసంతి రాంనగర్లో ఉన్న రామాలయం, మర్రికుంటలోని ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకున్నారు.
15 ఏండ్లుగా తలంబ్రాలు వితరణ
వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న 12 దేవాలయాలకు 15 ఏండ్లుగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్సీ జ్యువెల్లర్స్ అధినేత రమేశ్చంద్ర సంయుక్తగా ముత్యాల తలంబ్రాలను వితరణ చేస్తున్నారు. మొదటగా మంత్రి నిరంజన్‌రెడ్డి, వాసంతి దంపతుల చేతులమీదుగా రాజనగరం, జగత్పల్లి, నాగరవం, రాంనగర్ రామాలయం, వేంకటేశ్వర ఆలయం, బాలనగర్‌లోని అభయాంజనేయస్వామి, ఇందిరాకాలనీ, పీర్లగుట్ల, మర్రికుంట అభయాంజనేయస్వామి ఆలయాలకు ముత్యాల తలంబ్రాలు అందజేసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ వేడుకకు హాజరైన భక్తుల కోసం రామాలయం, మర్రికుంట, అభయాంజనేయస్వామి ఆలయాల్లో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు అలైఖ్య తిరుమల్, బాషానాయక్, మంజుల గోపాల్, ఆవుల రమేశ్, వినోద్‌గౌడ్, విజయ్, పోచ రవీందర్‌రెడ్డి, ఆలయ నిర్వాహకులు విశ్వనాథం, బాలీశ్వరయ్య, సునీల్ వాల్మీకి, అయ్యలూరి రఘునాథశర్మ, బాష్యం శ్రావన్‌కుమార్, నరేంద్రచార్యులు, వివిధ పార్టీల నాయకులు కృష్ణ, శంకర్ ప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, కోట్ల రవి, చీర్ల శ్రీను, జనార్దన్, ఆంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.