మహబూబ్‌నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనాల్సిందేనంటూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట ఢిల్లీకి సెగ తగిలేలా సాగుతున్నది. ‘పంజాబ్ ధాన్యం కొంటరెట్ల.. తెలంగాణ ధాన్యం కొనరెట్ల’ అంటూ సాగించిన ఉద్యమానికి రైతులోకం నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభిస్తున్నది. ఈ నెల 4వ తేదీ నుం చి ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణ శుక్రవారం వరకు విజయవంతంగా కొనసాగింది. ఈ నెల 11న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే మహాధర్నాతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధమైంది. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం తెలంగాణ రైతులపై మాత్రమే నిర్లక్ష్యం ప్ర దర్శించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ మహా ధర్నాతో బీజేపీకి గట్టి హెచ్చరికలు పంపేందుకు సిద్ధమైంది.
మండల కేంద్రాల్లో కేంద్రంపై యుద్ధం..
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు దీక్షల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలైనా.. ఉద్యమం మా త్రం కేవలం రైతుల కోసం మాత్రమే కావడంతో అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. గ్రామాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వమని ప్రతీనబూనారు.
హెచ్చరికలు పంపిన సడక్ బంద్..
తెలంగాణలో ఉద్యమాలు కొత్తకాదు. రాష్ట్ర సాధనే ఉద్యమాల పునాదులపై నిర్మితమైంది. అం దుకే రైతుల కోసం కూడా పోరుబాట దేశమంతా తెలియాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ జాతీయ రహదారులపై సడక్ బంద్‌ను ఎంచుకున్నది. ఈ నెల 6వ తేదీన పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూత్పూర్ వద్ద సుమారు గంటన్నర పాటు హైవేను దిగ్బంధించారు. రైతులు బీజేపీకి వ్యతిరేకంగా చేసిన నినాదాలు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారికే కాకుండా ఢిల్లీ పాలకులకు వినిపించేలా సాగాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే అతి పెద్ద జాతీయ రహదారిని దిగ్బంధించడంతో తెలంగాణ రైతుల డిమాండ్ ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చింది.
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన..
ఈ నెల 7న ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లా కేం ద్రాల్లో సాగిన నిరసన దీక్షలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణ పై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, రైతులపై చూ పుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కేంద్రం ఓ వైపు వడ్లు కొనమని కచ్చితంగా చెబుతున్నా.. బీజేపీ నే తలు బండి సంజయ్, కిషన్ రెడ్డి వరి పండించాల ని రైతులను రెచ్చగొట్టిన వీడియోలను స్క్రీన్లు పెట్టి ప్రదర్శించారు. ఈ వీడియోలు చూసిన రైతులు బీ జేపీ నేతల ద్వంద్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నల్ల జెండాలతో నిరసన..
శుక్రవారం అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ ది ష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. ప్రతి ఇంటిపైనా నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలియచేశారు. బీజేపీ తీరు.. రాష్ట్రంపై ఆ పార్టీ నేతల దుర్మార్గాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు, రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించడంలో టీఆర్ఎస్ నేతలు విజయవంతమయ్యారు. ఇకపై బీజేపీ నేతలు ఎంతటి విష ప్రచారాలు చేసినా ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది.
ఢిల్లీ పీఠానికి సెగ తగిలేలా..
ఈ నెల 11న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, కార్పొరేషన్ల చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, ముఖ్య ప్రజాప్రతినిధులంతా తరలనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 150 నుంచి 200 మంది వరకు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు తెలిపారు. మహాధర్నాతో బీజేపీ సర్కార్ పీఠానికి సెగ తగిలేలా చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయం యావత్ దేశానికి తెలిసేలా చేస్తామని పేర్కొంటున్నారు.
బీజేపీ బండారం బయటపెడతాం..
ఆదివారం ఉదయం ముఖ్య నేతలంతా ఢిల్లీ బయలుదేరుతున్నాం. సోమవారం జరిగే దీక్షతో బీజేపీ నేతల అబద్దపు మాటలు, ద్వంద్వ వైఖరి దేశమంతా తెలియజేస్తాం. వడ్లు కొనాలంటూ సాగిన నిరసన దీక్షలతో బీజేపీ నేతల రెండు నాల్కల ధోరణి రాష్ట్రమంతా తెలిసిపోయింది. కేంద్రంపై పోరుకు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దేశ రాజధానిలో జరిగే నిరసన దీక్షతో ఢిల్లీలో ఒకలా గల్లీలో మరోలా మాట్లాడే బీజేపీ నేతల వైఖరిని దేశ ప్రజలకు తెలియజేస్తాం. రాజకీయాల కోసం ఏ విధంగా బలి చేస్తున్నారో బండారం బయపడేలా చేస్తాం. వడ్లు కొనేదాకా పోరాటం ఆపేదే లేదు.
– లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే
రైతుల తడాఖా చూపిస్తాం..
అడుగడుగునా వివక్ష చూపిస్తూ, రైతుల కు అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కార్ మె డలు వంచుతాం. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ లో తెలంగాణ రైతుల తడాఖా చూపిస్తాం. దాదాపు 1500 మందితో ధర్నా చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దశలవారీగా సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని మరింత ఉ ధృతం చేయనున్నారు. కేంద్రం తలవంచక తప్పని పరిస్థితులు సృష్టిస్తాం. ధాన్యం కొనాల్సిందే. లేకుంటే రైతుల ఉసురుతగుల్తది. ఇతర రాష్ర్టాల్లో కొనుగోలు చేస్తున్న మాదిరిగానే.. తెలంగాణలో కూడా కొనకతప్పదు.
– గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్
ఉద్యమం కొత్తేమీ కాదు..
ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని సాధించారు. ఇక్కడి ప్రజలకు ఉద్యమం కొత్తేమీ కాదు. ఎదుగుదలను చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనబోమని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. పంటను కొనలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందా..? కేంద్రానికి చేతకాకపోతే తమ పంటను ఎగుమతి చేసేలా రాష్ర్టాలకు అనుమతి ఇవ్వాలి. ఇందుకు ఒప్పుకుంటుందా..? రైతులతో పెట్టుకున్న వాడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. వడ్లను కొనేదాకా సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమాలను కొనసాగిస్తాం.
– గట్టుయాదవ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, వనపర్తి
కేంద్రం బాసటగా నిలవాలి..
ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసి రైతులకు బాసటగా నిలవాలి. పార్టీ అధిష్టానం పిలుపుమేరకు జిల్లాలో చేపట్టిన నిరసన దీక్షలకు రైతులతోపాటు ప్రజల నుంచి పూర్తి సహకారం లభించింది. స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలిపారు. ఆందోళనలు తీవ్రతరం చేసినప్పటికీ.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైతుల సత్తా కేంద్రానికి తెలిసేలా11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగే నిరసన కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఢిల్లీ తరలనున్నారు. టీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షాన పోరాడుతుంది.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, గద్వాల
తాడోపేడో తేల్చుకుంటాం..
ధాన్యాన్ని కేంద్రం కొంటదా.. కొనదా.. అనే విషయంపై తాడోపేడో తే ల్చుకోవడానికై ఢిల్లీలో దీక్ష చేపడుతున్నాం. గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేసి పీఎంకు పంపించినా.., మండల, జిల్లా కేంద్రాలో ధర్నాలు, నిరసనలు చేసినా.. జాతీయ రహదారులు దిగ్బంధించినా.., ఇండ్లపై న ల్లజెండాలు ఎగురవేసినా.., సీఎం కేసీఆర్ లేఖ రాసినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదు. కేంద్రం కొనమని.., రాష్ట్ర బీజేపీ నాయకులు కొంటామని విరుద్ధ ప్రకటనలు చేస్తూ దొంగాట ఆడుతున్నారు. కేంద్రం స్పందించకపోవడంతో ప్రజాప్రతినిధులందరూ కలిసి ఢిల్లీలో ధర్నా చేసేందుకు సిద్ధమయ్యాం. – ఎస్.రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, నారాయణపేట