అయిజ, ఏప్రిల్ 9 : రాముడిపై ఉన్న అపారమైన భక్తిభావంతో బియ్యం గింజలపై ‘శ్రీరామ’ నామాలను రాసి గత పదేళ్లుగా భక్తిని చాటుకున్నాడు ఓ భక్తుడు. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామానికి చెందిన అర్చకుడు చక్రవర్తి గ్రామంలోని ఆంజనేయస్వామి, గుంటిరంగనాథుడు, శివాలయాలతోపాటు శ్రీరాముడి ఆలయాల్లో నిత్యం పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ ఏడాది తుపత్రాలలో జరిగే రాములోరి పెళ్లికి ‘శ్రీరామ’ నామాలు బియ్యం గింజలపై రాసి తలంబ్రాలలో కలపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక వైపు అర్చకవృత్తిని కొనసాగిస్తూ.. అయిజలో కిరాణం నడుపుతూ తీరిక సమయంలో బియ్యం గింజలపై ‘శ్రీరామ’ నామాలను రాశాడు. రాములోరి కల్యాణానికి ప్రతిఒక్కరూ ఇలా ‘శ్రీరామ’ నామాలు రాసి తలంబ్రాలలో కలిపితే పుణ్యం లభిస్తుందని చక్రవర్తి పేర్కొంటున్నాడు. కేవలం పట్టుదలతోనే ఈఏడాది 40రోజుల్లో 25,516 బియ్యం గింజలపై రాసినట్లు తెలిపారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని తుపత్రాల గ్రామంలోని రామాలయంలో నిర్వహించనున్న కల్యాణానికి వీటిని సమర్పించనున్నట్లు పేర్కొన్నాడు. గత ఏడాది చక్రవర్తి 11రోజులలో 25,116 బియ్యం గింజలపై శ్రీరామ నామాలను రాశాడు. ప్రతి ఏటా ఆధ్యాత్మిక చింతనతోనే ఈ రామనామాలు రాస్తున్నానని చక్రవర్తి తెలిపారు.