మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 3 : తెలంగాణ సర్కారు విద్యారంగాకి ప్రాధాన్యత ఇస్తున్నది. ‘మన ఊరు-మనబడి’తో బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు సైతం మంజూరు చేయనున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో 835 పాఠశాలలు ఉండగా.. తొలి విడుతలో 291 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ప్రణాళికలను రూపొందించింది. రానున్న మూడేండ్ల కాల వ్యవధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించేలా జిల్లా యంత్రాగం చర్యలు తీసుకుంటున్నది.
291 పాఠశాలలు ఎంపిక
ప్రభుత్వ పాఠశాలకు మంచి రోజులు వచ్చాయి. త్వరలోనే పనులు చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించా రు. మొదటి విడుతలో 291 పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పనులు చేపట్టనున్నారు.
త్వరలో పనులు ఆరంభం
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 835 పాఠశాలలు ఉండగా మొదటి విడుతలో 291 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో మహబూబ్నగర్ 124, జడ్చర్ల 99, దేవరకద్ర 68 నియోజకవర్గ పరిధిలో పాఠశాలలు ఎంపికయ్యాయి. అంతేకాకుండా ఆయా మండలాల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను పరిగణలోకి తీసుకొని తొలివిడుతలో ఎంపిక చేశారు. రానున్న విద్యాసంవత్సరంలో మౌలిక వసతులు కల్పించనున్న 291 పాఠశాలల అభివృద్ధికి జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనలను సిద్ధం చేశారు. ఎంపిక చేసిన పాఠశాలలకు సంబంధించి ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు అంచనాలకు వచ్చారు. రూ.30 లక్షలలోపు ప్రతిపాదనలు పంపిన పాఠశాలలకు సంబంధించి వెంటనే పనులను ప్రారంభించేందుకు నేరుగా కలెక్టర్కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రతిపాదనలు వచ్చిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లు ఆహ్వానించి పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుకోనున్నారు. ఇప్పటికే మండలానికి రెండు పాఠశాలల్లో పనులను ప్రారంభించారు.
మండలానికీ రెండు పాఠశాలల్లో పనులు ప్రారంభం
ప్రతి మండల పరిధిలోని రెండు పాఠశాలలను ఎంపిక చేసి పనులను ప్రారంభించాం.నిర్ధేశించిన సమయంలోపు పూర్తిస్థాయిలో పనులను ఆరంభిస్తాం. ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని మరమ్మతు పనులు ప్రారంభిస్తాం. పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఉషారాణి, డీఈవో, మహబూబ్నగర్