మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3: పట్టణ నలుమూలలా సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటు ముందుకు సాగుదామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 18వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని, రూ. 20లక్షలతో నిర్మించిన ముదిరాజ్ కమ్యూనిటీల్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం, రూ.10 లక్ష లతో నిర్మించనున్న డ్వాక్రా భవనం శంకుస్థాపన, బోయపల్లి దగ్గర అంబలికేంద్రం, చలివేంద్రం, ముస్లిం మైనార్టీ భవన నిర్మాణానికి రూ. 10 లక్షల ప్రొసీడింగ్‌ను ఎమ్మెల్యే నిధుల నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కమిటీ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్లను కలుపుతూ ముడా ఏ ర్పాటు అయినందుకుగానూ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో త్వరలోనే సూపర్‌స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామని, ట్యాంక్‌బండ్ వద్ద నెక్లెస్‌రోడ్డు నిర్మించడం జరుగుతుందన్నారు. గతంలో మహబూబ్‌నగర్ రూపురేఖలు ప్రస్తుతం జరుగుతున్న అభివృధ్ధితో ఒక్క మారు పోల్చుకొని చూస్తే క్షణంలో జరిగిన అభివృద్ధి అంతా తెలిసిపోతుందన్నారు. పదిహేను రోజులకు ఒక్కమారు నీరు వచ్చే మహబూబ్‌నగర్‌లో నేడు తాగునీటి సమస్య పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. వేసవికాలంలోయువత చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. ఇతరులకు సేవా చేయాలనే సంకల్పంతో ముందు కు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ. నర్సింహులు, కౌన్సిలర్ కిశోర్, గంజి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.