జడ్చర్ల, ఏప్రిల్ 3 : తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలోనే జడ్చర్ల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలోని పద్మావతి కాలనీలో పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం రాకముందు జడ్చర్లలో ఒక్కపార్కు కూడా లేదని గుర్తు చేశారు. పార్కుల స్థలాలు కబ్జాలకు గురయ్యాయని చెప్పారు. నేడు వాటిని గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో 20 పార్కులను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పరోక్షంగా ఎందరికో ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఊరచెరువు, నల్లకుంటలను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రంగనాయక గుట్టపై ఉన్న స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే పట్టణంలో రూ.30 నుంచి రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయని, మరో రూ.25 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపామన్నారు. మిషన్ భగీరథ నుంచి ఇంటింటికీ నల్లాల ద్వారా ఉచితంగా శుద్ధ జలాలను అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మున్సిపాలిటీలో నివసించే ప్రజలు జీవో నెంబర్ 58, 59ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామకంఠంలో నివసించే వారికి వారి ఇండ్లకు సంబంధించి ఎలాంటి హక్కులు లేవని, వారు జీవో నెంబర్ నుంచి ఇంటిహక్కులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్రం మన వరిని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణలో పండిన వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. కార్యక్రమంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్‌చైర్‌పర్సన్ సారిక, కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్, సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు జంగ య్య, శ్రీకాంత్, ఉమాదేవి, మాలిక్ పాల్గొన్నారు.