మహబూబ్‌నగర్ టౌన్, ఏప్రిల్ 3 : వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణాభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ, చౌరస్తాలు అభివృద్ధి చేశామన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించామని, నేడు భగీరథ జలాలు ఇంటింటికీ అందుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు కిశోర్ కుమార్, బాలేశ్వరి, వేదవ్రత్, మాజీ కౌన్సిలర్ వెంకన్న, నాయకులు మహ్మద్ ఇక్బాల్, రహ్మాన్, నూరుల్ హసన్, డీఈ సూర్యనారాయణ పాల్గొన్నారు.
మినీ ట్యాంక్ బండ్ పనులు పక్కాగా ఉండాలి
పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులు పక్కాగా ఉండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ట్యాంక్‌బండ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులను వేగంగా, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యంతో ఉండాలన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, అదనపు కలెక్టర్ సీతారామారావు, కౌన్సిలర్లు కిశోర్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, కట్టా రవికిషన్‌రెడ్డి, నాయకులు నవకాంత్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.