అయిజ, ఏప్రిల్ 3 : టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత తిరుమల్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజకీయంలో 30 ఏండ్లకుపైగా తిరుమల్‌రెడ్డితో తనకు అనుబంధం ఉన్నదని, నిక్కచ్చిగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ గుర్తింపును ఆయన సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఆదివారం మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన తిరుమల్‌రెడ్డి ఏకాదశ దినకర్మ, సంస్మరణ సభకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరితతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుమల్‌రెడ్డి కాంస్య విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల్‌రెడ్డి మరణించిన సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీలతో కలిసి బీజేపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీలో ఉన్నామని, అందుకే అంత్యక్రియలకు హాజరుకాలేదన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఆయన కుటుంబం నుంచి పార్టీలోకి వారసులుగా ఎవరు ముందుకొచ్చినా సహకారం ఉంటుందని సీఎం కేసీఆర్ మాటగా చెబుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు తిరుమల్‌రెడ్డి సతీమణి సువర్ణమ్మ, తనయుడు గౌతమ్‌రెడ్డి, సోదరుడు శ్రీధర్‌రెడ్డికి మంత్రి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ తిరుమల్‌రెడ్డి హఠాన్మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరనిలోటన్నారు. ఎన్నికల సమయంలో పట్టువదలని విక్రమార్కుడిలా గెలుపు కోసం కృషి చేసేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు అనుచరులు, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు. టీఆర్ఎస్ పెద్దదిక్కును కోల్పోయిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఎంతగానో కృషి చేశాడన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ ఆయనలోటును ఎవరూ పూడ్చలేరన్నారు. వ్యక్తిగతంగా తనకు తిరుమల్‌రెడ్డిపై ఎంతో అభిమానం ఉందన్నారు. ఎమ్మెల్సీ కాటేపల్లి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ఎన్నో రకాల సలహాలు, సూచనలు చేశాడని చెప్పారు. ఉత్తనూర్ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దిన మహనీయుడు ఆయన అని కొనియాడారు.
తిరుమల్‌రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ
తిరుమల్‌రెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, రామిరెడ్డి దామోదర్‌రెడ్డి ఆవిష్కరించి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు భరత్‌సింహారెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, సంపత్‌కుమార్, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్, గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి, జోగుళాంబ దేవస్థాన చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుందర్రాజు, అజయ్, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి, మాజీ ఎంపీపీలు మధుసూదన్‌రెడ్డి, సీతారాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, ఒంగోలు జాతి పశుపోషకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.