జడ్చర్ల, ఏప్రిల్ 2: ప్లవనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ శుభకృత్ నామ సంవత్సరాదికి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. మండలంలోని ఆయా గ్రామాలతోపాటు జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం ఉగాది పండగను ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు, రైతులు ఆలయాలు, వ్యవసాయ పొలాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయాల వద్ద వేదపండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. జడ్చర్లలోని హనుమాన్ ఆలయం, బూరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఏప్రిల్ 2 : మండలవ్యాప్తంగా శనివారం ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని సేవించారు. సాయంత్రం ఆలయాల వద్ద పురోహితులు పంచాంగం చదివి వినిపించారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఏప్రిల్ 2: ఉగాది పండుగను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని వెన్నాచేడ్‌లో గ్రామస్తులంతా ఉగాది పచ్చడి తయారు చేసి సర్పంచ్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సాయంత్రం వెన్నోని ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ శకటోత్సవం నిర్వహించారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో సాయంత్రం పంచాంగ శ్రవణం విన్నారు. జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ మండల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
మహ్మదాబాద్ మండలంలో..
మండలంలోని నంచర్ల, గాధిర్యాల్, ముకర్లాబాద్, దేశాయిపల్లి, మహ్మదాబాద్ తదితర గ్రామాల్లో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు భిక్షపతి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో..
ఉగాది సంబురాలను జిల్లాకేంద్రంలో వాడవాడలో ఉత్సాహంగా నిర్వహించారు. భక్తులు శనివారం తెల్లవారుజామున నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు సంవత్సరం ఆరంభం సందర్భంగా ఈ ఏడాది తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకున్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలకేంద్రంతోపాటు కౌకుంట్ల, గోపన్‌పల్లి, గుడిబండ, గూరకొండ, చిన్నరాజమూర్, వెంకటాయపల్లి తదితర గ్రామాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజలు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఇంట్లో కొత్త కుండల్లో పచ్చడి తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేశారు. సాయంత్ర ఆలయాల్లో అర్చకులు, పండితులు కొత్త పంచాంగం చదివి వినిపించారు.
నవాబ్‌పేట మండలంలో..
మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో శనివారం తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతులు వ్యవసాయ పొలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ప్రజలు ఇండ్లకు మామిడి తోరణాలు కట్టి తెలుగు సంవత్సరానికి స్వాగతం పలికారు. సాయంత్రం ఆయా గ్రామాల్లోని ఆలయాల ఆవరణలో వేదపండితులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఏప్రిల్ 2: మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో శనివారం ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలు గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. భక్షాలు, పచ్చడి చేసి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలు శనివారం మండల ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం తమ జీవితాలు బాగుండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రైతులు కాడెద్దులను అలంకరించి వ్యవసాయ పనులను ప్రారంభించారు. సాయంత్రం ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో వేదపండితుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగం విన్నారు.
ఊరూరా పంచాంగ శ్రవణం
శుభకృత్ నామ సంవత్సరం, ఉగాది పండుగ సందర్భంగా పురోహితులు అడ్డాకుల శివాంజనేయ షిర్డీసాయి ఆలయంతోపాటు రాచాల పొన్నకల్, శాఖాపూర్, పెద్దమునగల్‌చేడ్, బలీదుపల్లి తదితర గ్రామాల్లో పురోహితులు పంచాంగ పఠనం చేశారు.
అదేవిధంగా మూసాపేటతోపాటు, నిజాలాపూర్, వేముల, నందిపేట, కొమిరెడ్డిపల్లి, జానంపేట, పోల్కంపల్లి తదితర గ్రామాల్లోని ఆలయాల్లో పూజారులు పంచాంగ శ్రవణం పఠనం చేసి వినిపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఉన్నారు.
అన్నింటికీ కలిసొచ్చే కాలం
శుభకృత్ నామ సంవత్సరం అన్నిరంగాలకు కలిసొచ్చే కాలమని శనివారం పంచాంగ శ్రవణంలో రామలింగేశ్వరస్వామి ఆలయ అర్చకుడు మంజూనాథస్వామి తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణగౌడ్, గ్రామస్తులు అశోక్‌గౌడ్, రాములు, నర్సింహులు, బ్రహ్మయ్య పాల్గొన్నారు.