మహబూబ్‌నగర్, మార్చి 25 : రోడ్డు విస్తరణతో చిరువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారులతో మంత్రి మాట్లాడారు. రోడ్డు విస్తరణతో చిరువ్యాపారుల ఉపాధికి ఆటంకం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రధానరహదారి పక్కన చిరువ్యాపారులకు ప్రత్యేకంగా దుకాణాలను ఏర్పాటు చేసి ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ వద్ద ప్రత్యేక ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్ రాము, టౌన్‌ప్లానింగ్ అధికారి ప్రతాప్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.