దేవరకద్ర రూరల్/ఆత్మకూరు, నవంబర్ 14: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారి బంగారు ఆభరణాలను తీసి వాటి స్థానంలో వెండి ఆభరణాలను అలంకరించినట్లు ఆలయ ఈవో శ్యాంసుందరాచారి తెలిపారు. బంగారు ఆభరణాలను అమ్మాపూర్ సంస్థానాధీశుడు శ్రీరాంభూపాల్, ఆలయ పాలక మండలి మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, సభ్యుల సమక్షంలో దేవాదాయశాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు ఆభరణాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకుకు తరలించి భద్రపరిచినట్లు ఈవో తెలిపారు. అమావాస్య వరకు జాతర కొనసాగుతుందని తెలిపారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు వెంకటేశ్వర్లు, ఆలయ సిబ్బంది శివానందాచారి, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.