దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వం మందుల కిట్లను అందిస్తున్నది. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ రోగులకు నెలనెలా ఔషధాలను పంపిణీ చేస్తున్నది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) కింద మందులను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. 30 ఏండ్లు దాటిన వారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నది. వనపర్తి జిల్లాలో 6,06,263 మంది జనాభాకుగానూ ఇందులో చాలా మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా హైపర్‌టెన్షన్, డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య అధికారికంగా తెలిసింది. దీంతో 2,84,901 మందికి స్క్రీనింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా.. ఇప్పటి వరకు రెండు విడుతల్లో 2,79,211 మందికి చేశారు. హైపర్‌టెన్షన్‌కు గురయ్యే వారు 42,732 మందిని, డయాబెటీస్‌కు 25,639 మందిని సస్పెక్ట్ చేశారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాధితులకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కో ఆర్డినేటర్‌ను నియమించి పరీక్షలు, చికిత్స అందజేస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ)తో బాధపడుతున్న రోగులకు ప్రతినెలా ఔషధాల కిట్లు అందజేస్తున్నది. హైపర్‌టెన్షన్ (బీపీ), డయాబెటీస్, క్యాన్సర్ పేషంట్లకు స్క్రీనింగ్ చేసి వ్యాధి నిర్ధారణ, దాని తీవ్రతను అనుసరించి మందులను ఉచితంగా ప్రభుత్వమే పంపిణీ చేస్తున్నది.
– వనపర్తి, నవంబర్12(నమస్తే తెలంగాణ)
రాష్ట్ర వ్యాప్తంగా 22జిల్లాల్లో అమలువుతుండగా అందులో వనపర్తి జిల్లా కూడా ఉన్నది. 30ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ షుగర్, బీపీ, క్యాన్సర్‌కు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బరువు, ఎత్తు, నడుము చుట్టుకొలత, బీపీ, షుగర్ టెస్ట్ చేస్తారు. క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలు, శరీరంలోపల ఏమైనా గడ్డలు, అసాధారణ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటారు. కాలంతో పరుగెత్తుతూ ఒత్తిడితో కూడిన జీవనంతోపాటు ఆహార అలవాట్లు, జీవన విధానంలో మార్పుల వల్ల అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఆహారపు అలవాట్లతో ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్ కూడా కాటు వేస్తున్నది. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి నియంత్రించే పనిలో పడింది. ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నివారించాలని, తీవ్రంగా ఉంటే చికిత్స అందజేయాలని నిర్ణయించి సేవలు అందిస్తున్నది.
నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. దీనికి కో ఆర్డినేటర్‌ను ఏర్పాటు చేసి పరీక్షలు, చికిత్స అందజేస్తున్నది. వనపర్తి జిల్లాలో 6,06,263 మంది జనాభా ఉండగా ఇందులో చాలా మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా హైపర్‌టెన్షన్, డయాబెటీస్ పేషంట్ల సంఖ్య అధికారికంగా తెలిసింది. జిల్లా స్క్రీనింగ్ టార్గెట్ 2,84,901 మంది కాగా ఇందులో ఇప్పటి వరకు రెండు విడుతల్లో 2,79,211 మందిని స్క్రీనింగ్ చేశారు. దాదాపు 98 శాతం పూర్తి చేశారు. ఇందులో హైపర్‌టెన్షన్‌కు గురయ్యేవారిని స్క్రీనింగ్ ద్వారా జిల్లాలో 42,732 మందిని సస్పెక్ట్ చేశారు. అదేవిధంగా డయాబెటిస్‌కు సంబంధించి స్క్రీనింగ్ ద్వారా 25,639 మందిని సస్పెక్ట్ చేశారు. ఇందులో 31,464 మందికి హైపర్‌టెన్షన్ ఉన్నట్లు అధికారికంగా తెలియగా ప్రభుత్వం తరఫున 23,539 మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. మిగతా 7,925 మంది ప్రైవేటులో చికిత్స తీసుకుంటున్నారు. డయాబెటిస్ విషయానికి వస్తే జిల్లాలో 16,385 మందిని గుర్తించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ప్రభుత్వం 12,381 మందికి ఉచిత చికిత్స, మందులు అందిస్తుండగా, మిగతా 4004 మంది ప్రైవేటుగా చికిత్స తీసుకుంటున్నారు. క్యాన్సర్ విషయానికి వస్తే ఓరల్‌గా 13, బ్రెస్ట్ క్యాన్సర్ 13, సెర్వైకల్ 39, ఇతర రకాల క్యాన్సర్లు 24 మందితో కలిసి ఇప్పటివరకు 189 మందిని ఐడెంటీఫై చేసి చికిత్స అందిస్తున్నారు. మందులను ఆరోగ్య కార్యకర్తలు ఇంటికి వెళ్లి అందిస్తారు.
ఉచిత మందుల పంపిణీకీ ప్రత్యేక మెడిసిన్ కిట్స్ వాడుతున్నారు. మూడు రంగుల అరలు కలిగిన పౌచ్‌లతో కూడినవి వాడుతున్నారు. నిరక్షరాస్యులు కూడా సులభంగా మెడిసిన్‌ను గుర్తుపట్టి సమయానికి వేసుకునేలా ప్రభుత్వం పకడ్బందీగా కిట్‌ను తయారు చేసింది. ఒక పర్సు ఆకారంలో ఉండే కిట్‌లో మూడు వేర్వేరు రంగుల పౌచ్‌లు ఉంటాయి. రోజూ సమయాన్ని బట్టి వేసుకునే మందులను వేర్వేరు పౌచ్‌లలో ఉంచుతారు. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గోధుమ, రాత్రి నలుపు రంగు పౌచ్‌లలో ఉన్న ట్యాబ్లెట్లను మింగాల్సి ఉంటుంది.
ఇప్పటికే రెండు దశల్లో స్క్రీనింగ్ పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన టార్గెట్‌లో 98 శాతం పూర్తి చేశాం. ఇంకా స్క్రీనింగ్ జరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో పరీక్షలు చేస్తున్నాం. నిర్ధారణ అయితే ప్రతినెలా మందులు వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తాం. ఆరోగ్య సమాచారం ఆధారంగా మందుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయి.
– రవిశంకర్,డీఎంహెచ్‌వో, వనపర్తి