పాల మూరులో వెదురు బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. ఓ కుటుంబం తమ కళతో జిల్లా ఖ్యాతిని నలుదిక్కులా చాటుతున్నది. వెదురుతో అందమైన కళాకృతులను తీర్చిదిద్దుతున్నారు. అల్లికలతో అబ్బుర పర్చుతున్నారు. బుల్లెట్, ఎడ్ల బండ్లు, సైకిల్, రథం, పూలబొకేలు, వివిధ రకాల బుట్టలు.. ఇలా 2 వందల రకాలకుపైగా ఉత్పత్తులను తయారు చేశారు. కొండపల్లి బొమ్మలకన్నా అందంగా ఉన్న బొమ్మలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. తక్కువ ధరకే వీటిని విక్రయించి ఉపాధి పొందడంతోపాటు శిక్షణను ఇస్తున్నారు.
మహౠబ్‌నగర్ అర్బన్, నవంబర్ 12: కాదేది కళకు అనర్హం అన్న సామెతను నిజం చేస్తూ పాలమూరు జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం వెదురుతో అందమైన కళాకృతులను అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలు చూస్తే వెదురుతో తయారు చేశారా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు. వీళ్లు వెదురుతో తయరుచేసిన ఏ వస్తువైన అద్భుతంగా ఉంటుంది. చూడచక్కని అల్లికలతో ఆకట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో వాడుకోవడానికి బుట్టలు, తట్టలు, చాట్లు, తడికె ఆలంటి వస్తువులన్నీ వెదరుతో చేసినవే. మళ్లీపాత రోజులను గుర్తుకు తేస్తూ వాటిని తయారు చేస్తున్నారు. పనితనానికి నైపుణ్యం జోడించి ఆధునికతకు అద్దం పట్టే విధంగా వివిధ కళాకృతులు నచ్చే విధంగా తయారు చేస్తున్నారు. వెదరుతో అల్లిన హస్తకళాకృతులు మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. వీటిని ఇండ్లలో అలంకరిస్తే కొండపల్లి బొమ్మలకన్నా అద్భుతంగా కనిపిస్తున్నాయి.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వీరి పనితనాన్ని మెచ్చుకుని కొత్తగా ఏర్పాటు చేస్తున్న శిల్పారామంలో వెదురు ఉత్పతులతో ప్రత్యకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కుల వృత్తులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా మేదర సంఘానికి ఒక భవనం ఏర్పాటుకు స్థలంతో పాటు నిధులు కూడా మంజూరు చేయిస్తామని చెప్పారు. అంతేకాక హరితహారం ద్వారా దేశంలో మొట్టమొదటగా వెదురు మొక్కలను నాటే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టి కులవృత్తులకు అండగా నిలిచింది.
మేము తయారు చేసిన రకరాకల వస్తువులకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఒక్క వెదురు బొంగు రూ.200 నుంచి రూ.500 వరకు దొరుకుతుంది. బొమ్మ పనితనాన్ని బట్టి వెయ్యి నుంచి ఐదువేల వరకు ధర పలుకుతుంది. చాలామంది పెద్దపెద్ద ఇండ్లలో, అపార్ట్మెంట్లల్లో వెదురుతో తయారుచేసిన వాటికి ప్రాధాన్యత ఇస్తారు. చాలా చోట్ల రెస్టారెంట్లలో కూడా మా బొమ్మలు పెడుతున్నారు. వెదురు కళాకృతులను తయారు చేయడమే కాకుండా కళను పదిమందికి నేర్పించాలనే ట్రైనింగ్ సెంటర్ పెట్టాము. మంచి ఆదాయంతో పాటు బొమ్మలకు మంచి గిరాకీ లభిస్తుంది.
– కృష్ణయ్య, బొమ్మల తయారీ నిర్వాహకుడు, మహబూబ్‌నగర్
మనం రోజూ చూసే అనేక వస్తువుల్ని తమ అల్లికలతో తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. బుల్లెట్ బండి, ఎద్దుల బండి, సైకిల్, రథం, పూల బొకేలు, కూరగాయల బుట్టలు.. ఇలా దాదాపు 200రకాల ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నారు. వినియోగదారులు ఆకర్షించే విధంగా అక్కడక్కడ హస్తకళా ప్రదర్శనల్లో వీటిని ప్రదర్శించి అమ్ముతున్నారు. వీటిని తయారు చేయడానికి నాణ్యమైన వెదురును అస్సాం, కర్ణాటకలోని రాయిచూర్ నుంచి కొనుగోలు చేస్తున్నారు.