ఖమ్మం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పరిసమాప్తమైంది. గత పది రోజులుగా హోరెత్తిన ప్రచార పర్వానికి సోమవారం తెరపడింది. తాము గెలిస్తే ఏం చేస్తామో చెప్పడంతోపాటు పట్టణాలు అభివృద్ధి చెందకపోవడానికి ప్రస్తుత అధికార పార్టీ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రతిపక్షాలు విమర్శనాస్ర్తాలు సంధించాయి. ఈ పది రోజులపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, బీజేపీ వంటి పార్టీలు తాము పోటీ చేసున్న స్థానాల్లో అభ్యర్థులతోపాటు నాయకులతోనూ విస్తృతంగా ప్రచారం చేయించాయి.
వార్డులు, డివిజన్ల సమస్యలను ప్రస్తావిస్తూ తాము గెలిస్తే చేసే అభివృద్ధిపై అభ్యర్థులు హామీలిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇవి సాధారణ ఎన్నికలను తలపించాయి. మున్సిపాలిటీల్లో గులాబీ జెండాలను ఎగురవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతోపాటు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాలన, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనందున బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ అధిష్టానం నియమించిన ఇన్చార్జులు, పార్టీ నేతలు.. అభ్యర్థులతో విస్తృత ప్రచారం చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. పలు మున్సిపాలిటీల్లో ఆయా పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఆయా పార్టీల నేతలు కూటమిగా ఏర్పడి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.