హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ నాటి సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. నగరంలోని ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి హాజరై.. ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాలపై ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ఈనెల 24న ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని రెండున్నరేండ్ల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నామని చెప్పారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సీఎం, మంత్రులు, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ హామీల అమలుకు నోచుకోలేదని వాపోయారు. ప్రభుత్వ హామీల్లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం, యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, 2021 వేతన సవరణ, ఆర్టీసీ విస్తరణ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించడం ఉన్నట్టు తెలిపారు.
మహాలక్ష్మితో పెరిగిన పనిభారం..
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మహాలక్ష్మి పథకం’ ఆర్టీసీ కార్మికులపై విపరీతమైన పనిభారం మోపిందని కార్మిక సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. 8 గంటలు ఉండాల్సిన డ్యూటీని.. రోజుకు 16 గంటలు బలవంతంగా చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికుల్లో రోజురోజుకూ అసంతృప్తి, వ్యతిరేకత పెరుగుతున్నాయని, అందులో భాగంగానే జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమైనట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 24న ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎన్ కృష్ణ (ఎన్ఎంయూ), జే రాఘవులు (ఈయూ), ఎన్ బాల్ రెడ్డి (ఈయూ), ఎన్ బుద్ధవిశాల్ (బీకేయూ), ఎం ఏ మజీద్ (ఈయూ), డీ రాంచందర్ (బీడబ్ల్యూయూ), పాపయ్యగౌడ్, ముత్యాలు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.