మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్12: యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజలాంటిదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నం పెట్టే తల్లులగా భావిస్తుంటారని తెలిపారు. మహబూబ్‌నగర్ క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవానికి భారీ దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సంప్రదాయంగా జరిగే ఉత్సవాలు పట్టణంలో ఎంతో ప్రత్యేకమన్నారు. సీఎం కేసీఆర్ కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చారన్నారు. దేశంలోనే అత్యధిక గొర్రెలు, పశు సంపదకు మన రాష్ట్రం ప్రఖ్యాతి గాంచిందన్నారు. రాష్ట్రంలో అన్ని కులవృత్తుల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్ హజ్రత్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ షా సాహెబ్ దర్గాలో మెహిఫిల్ మిలాద్ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, గొర్రెల కాపరుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ బాలరాజు యాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, ముడా డైరెక్టర్ సాయిలుయాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట నర్సయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, సత్యం యాదవ్, యాదవ ఉద్యోగ సంఘాల నాయకులు కృష్ణమోహన్, బాలుయాదవ్, వెంకట్ రాములు, జుర్రు నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అన్వర్ పాషా, ఆర్టీఏ సభ్యుడు జావేద్ బేగ్ స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 12: గతంతో పోల్చితే ఉన్నత శిఖరాలకు మహబూబ్‌నగర్ చేరుకుంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జిల్లా గౌడ, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పాల్గొని మాట్లాడారు. పట్టణానికి సమీపంలో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో రూ.4 కోట్లతో బర్డ్స్ ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 800 రకాల పక్షులు, అతి పెత్త లంగ్ స్పేస్ ఉండడం గొప్ప విషయమన్నారు. గతంలో ఒక చిన్న నర్సరీగా ఉన్న మయూరీ పార్కు నేడు దేశంలోనే అతి పెద్ద అర్బన్ పార్కుగా మారిందని తెలిపారు. మహబూబ్‌నగర్ పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో మంత్రి అంటే ఎలా ఉండేవారో పేపర్, టీవీల్లో మాత్రమే చూసేటోళ్లు.. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. సామాన్యులకు సైతం ప్రత్యేకంగా సమయం కేటాయించి అందరి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రోడ్డుపై ప్రయాణం చేసే సమయంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే వారి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పేదలకు నిరంతరం అండగా ఉంటామని, వారికి సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు, వారి తల్లిదండ్రులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మెమోంటోలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గౌడ, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు సత్తూర్ వెంకటస్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి రాజయ్యగౌడ్, నాయకులు లక్ష్మణ్‌గౌడ్, చక్రవర్తిగౌడ్, రవీందర్‌గౌడ్, వెంకయ్యగౌడ్, నారాయణగౌడ్, గోపాల్‌గౌడ్, ధనుంజయగౌడ్, సత్యనారాయణగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 12: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీకి ఆకర్షితులవుతున్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 36, 41వ వార్డులతోపాటు మోతీనగర్, క్రిస్టియన్‌పల్లికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ మహ్మద్ ఖాజాపాషా ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. శ్రీనివాస్, రాజు, భీముడు, చంద్రశేఖర్, అర్జున్, వెంకటేశ్, లోకేశ్, ప్రకాశ్, చంద్రమౌళి, శేఖర్, జావిద్, యాకూబ్తోపాటు పలువురు పార్టీలో చేరగా.. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడానికి పార్టీశ్రేణులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.