వనపర్తి రూరల్, నవంబర్ 12 : రాష్ట్రంలో ఆరుగాలం రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎక్కడికక్కడే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. పండిన ప్రతి గింజనూ కొంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కర్షకులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరపాలని అధికారులను ఆదేశించారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. దళారుల మాటలకు మోసపోవద్దని, నేరుగా కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. ఈ ఏడాది వనపర్తి జిల్లాలో 1,82,963 ఎకరాల్లో వరిని సాగు చేయగా.. 5.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానున్నదని వ్యవసాయ అధికారులు అంచనా వేశారన్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆధార్ అనుసంధానం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. విక్రయానికి తరలించే ముందు వడ్లను బాగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇప్పటికే ఐకేపీ, పీఏసీసీఎస్, ఏఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాలకు తరలించిన ధాన్యం అకాల పరిస్థితులతో నష్టపోకుండా చర్యలు తీసుకున్నామన్నారు. వరితోపాటు పాటు నూనె, పప్పు దినుసుల, ఇతర పంటల సాగు చేయాలని సూచించారు. రెండో పంట సాగుకు డిసెంబర్లో రైతుబంధు సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందని చెప్పారు. అలాగే మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి మండలంలోని సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి, నాగవరం, రాజనగరం సొసైటీ చైర్మన్లు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, విజయ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ కురుమూర్తి యాదవ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, కౌన్సిలర్లు నారాయణ, బాషానాయక్, సొసైటీ వైస్ చైర్మన్లు రఘువర్ధన్‌రెడ్డి, రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, శిక్షణ తరగుతుల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, సివిల్ సప్లయి అధికారులు సుదర్శన్, కొండల్రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.