హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఒకరేమో తొమ్మిదేండ్లు.. మరొకరేమో ఎనిమిదేండ్లు.. ఇంకొకరేమో ఏడేండ్లు. ఇలా రాష్ట్రంలో కొందరు విద్యాశాఖ అధికారులు లాంగ్.. లాంగ్ స్టాడింగ్లో కొనసాగుతున్నారు. డీఈవోలు ఏండ్లకేండ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆ మూడు గ్రేటర్ జిల్లాలోని డీఈవోలు లాంగ్ స్టాండింగ్ అధికారుల జాబితాలో ఉండటం గమనార్హం. సర్కార్ వీళ్లను బదిలీ చేయకపోవడంతో లాబీలు మరింత బలపడుతున్నాయట.
చాలా విషయాల్లో చక్రం తిప్పుతున్నారట. అక్రమ డిప్యూటేషన్ల రాజ్యం నడుస్తున్నదట. వాస్తవానికి మూడేండ్లు దాటితే లాంగ్ స్టాడింగ్గా పరిగణిస్తారు. కానీ ఏండ్లుగా బదిలీ చేయకపోవడంతో విద్యాశాఖ గాడి తప్పుతున్నదట. అంతా తెలిసినా విద్యాశాఖ చోద్యం చూస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 33 జిల్లాలకు కేవలం 12 డీఈ వో పోస్టులే ఉన్నాయి. 24 డిప్యూటీ ఈవో పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. డీఈవో పోస్టులను నేరుగా భర్తీచేయకుండా డిప్యూటీ ఈవోలకు పదోన్నతులు కల్పించి భర్తీచేస్తున్నారు. పోస్టుల్లేకపోవడం, ఖాళీగా ఉన్నవి భర్తీచేయకపోవడంతో అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. కొంత కాలం క్రితం వరకు డిప్యూటీ ఈవోలకు డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆ తర్వాత ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, లెక్చరర్లకు ఈ బాధ్యతలు ఇచ్చారు. ఆ తర్వాత డైట్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల వంతు వచ్చింది. ఆ తర్వాత అసిస్టెం ట్ డైరెక్టర్లకు ఇచ్చారు. ఇప్పుడు ఐఏఎస్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలకు అదనపు బాధ్యతలు అప్పగించాల్సి వస్తున్నది.