కాప్రా, ఫిబ్రవరి 8: పోటీ పరీక్షల సందర్భంగా చేసిన పొరపాట్లకు చింతించక భవిష్యత్తులో రాయబోయే పరీక్షల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు చిత్తశుద్ధ్దితో శ్రమించాలని ప్రముఖ శాస్త్రవేత్త, ఎన్ఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, బోర్డ్ చైర్మన్ కోమల్కపూర్ అన్నారు. ఆదివారం ఏఎస్‌రావునగర్‌లోని హోమీ జే బాబా ఆడిటోరియంలో డాక్టర్ ఏఎస్రావు అవార్డ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ర్టాల్లోని 9, 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన 35వ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, బహుమతుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. 9వ తరగతిలో ప్రథమస్థానం సూర్యాపేట కుచెందిన యాస వీక్షణ, ద్వితీయ, తృతీయ స్థానాలు ఖమ్మంకు చెందిన కుమారి ఇషాసింగ్, ధరావత్ హర్షవర్ధన్‌కు, 10వ తరగతిలో ప్రథమ స్థానం సూర్యాపేటకు చెందిన ఉలువల వైష్ణవి, ద్వితీయ స్థానం గట్టి జయంత్ అశ్విన్ (రాజమండ్రి), తృతీయస్థానం లక్ష్మీ శారర్వాణి రుద్రభట్ల (ఖమ్మం)కు లభించగా, వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులను అందజేశారు.
9వ తరగతిలో 18 ర్యాంకర్లను, 10వ తరగతిలో 17మంది ర్యాంకర్లను ప్రకటించి వారికి ప్రశంసాపత్రాలను అంద జేశారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ. 25వేలు, ద్వితీయస్థానం పొందిన వారికి రూ. 15వేలు, తృతీయస్థానంకు రూ.10వేలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అవార్డ్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ జీఎస్వీఆర్కే చౌదరి అధ్యక్షత వహించారు. అడ్వైజర్లు ప్రొ.ఎల్ఎస్రావు, ప్రొ. సీనాగేశ్వరరావు, కార్యదర్శి కే రామరాజు, ప్రతినిధులు ఆర్.కృష్ణమూర్తి, డా.ఎస్.రమణ, సీచంద్రశేఖరమ్, టి.వేణుగోపాలరావు, జీ కృష్ణమూర్తి, డా.ఎంవీఎస్ మహేంద్ర, వైవీ సుబ్బారావు, కే మహాదేవ్, హరినాథరావు, శేఖర్ పాల్గొన్నారు.