హైదరాబాద్ : మరో మూడు రోజుల్లో ఇరాన్ యుద్ధం( Iran war) ముగిస్తామని డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్( Antony Albanese) స్పందించారు. యుద్ధం ప్రారంభానికి ముందు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదన్నారు. ఇరాన్‌తో చేసిన యుద్ధంలో అసలు లక్ష్యాలు నెరవేరాయని, ఇంకా అక్కడ ఏమి సాధించాల్సి ఉందో స్పష్టంగా తెలియడం లేదన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఎంతో నష్టపోయిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం ఎవరికి మంచిది కాదన్నారు. అది ఎంతకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. యుద్ధం ముగింపుపై స్పష్టత ఉండాలని సూచించారు.
కాగా, వైట్‌హౌస్‌లో జాతినుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఇరాన్ ముఖ్య నేతలను అంతమొందించాం. మరో మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని చెప్పారు. హర్మూజ్ జల సంధి నుంచి తమకు ఎలాంటి చమురు అక్కర్లేదని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ కోసం మాత్రమే వినియోగించుకోవాలి అని సూచించారు. సంక్షోభం ముగిశాక హర్మూజ్ జల సంధి తెరుచుకుంటుందని పేర్కొన్నారు. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధ దేశంగా మారనివ్వమని తెలిపారు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. ఇరాన్ 45 వేల మందికి మృతికి కారణమైందన్నారు.ఇరాన్ నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్‌ను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నదని పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని వెల్లడించారు.