IPL 2026 | మార్చి 28 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మొత్తం 10 జట్లు తలో మ్యాచ్ ఆడి తమ ప్రస్థానాన్ని ప్రారంభించాయి. ఈ సీజన్‌ను రాజస్థాన్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పంజాబ్ జట్లు విజయాలతో ఆరంభించగా, గుజరాత్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్, చెన్నై జట్లు ఓటములతో టోర్నీని మొదలుపెట్టాయి. గెలిచిన ప్రతి జట్టుకు రెండు పాయింట్లు వచ్చినప్పటికీ, నెట్ రన్‌రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో స్థానాలు మారాయి. చెన్నైపై భారీ విజయాన్ని సాధించిన రాజస్థాన్ జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు నెట్ రన్‌రేట్ +4.171గా ఉండటం విశేషం. రెండో స్థానంలో బెంగళూరు జట్టు +2.907 నెట్ రన్‌రేట్‌తో ఉంది. మూడో స్థానంలో ఢిల్లీ +1.397 నెట్ రన్‌రేట్‌తో కొనసాగుతోంది.
నాలుగో స్థానంలో ముంబై జట్టు +0.687 నెట్ రన్‌రేట్‌తో ఉండగా, ఐదో స్థానంలో పంజాబ్ జట్టు +0.509 నెట్ రన్‌రేట్‌తో నిలిచింది. ఇక మిగిలిన జట్లలో గుజరాత్, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్, చెన్నై జట్లు వరుసగా ఆరు నుంచి పది స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంకా లీగ్ దశలో ప్రతి జట్టు మరో 13 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
మూడో, నాలుగో స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో క్వాలిఫయర్-2లో పోటీ పడుతుంది. ఆ మ్యాచ్ విజేత ఫైనల్లోకి చేరుతుంది. ఐపీఎల్ 2026 ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాబోయే మ్యాచ్‌లతో పాయింట్ల పట్టికలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు వరుసగా ట్రోఫీలు సాధించిన చెన్నై జట్టు ఈ సారి కూడా చెత్త ప్రదర్శన కనబరుస్తుండడం ఫ్యాన్స్‌ని ఎంతగానో కలవరపరుస్తుంది.