Ramayana | బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ నుంచి తాజాగా కీలక అప్డేట్ వెలువడింది. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి.
ఈ గ్లింప్స్‌లో రణబీర్ కపూర్ రాముడిగా ఎంతో గంభీరంగా, శాంత స్వభావంతో కనిపిస్తున్నారు. సంప్రదాయ వేషధారణలో ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ముఖంలో కనిపించిన ప్రశాంతత, ధైర్యం, దైవత్వం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిత్రంలో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణుడిగా యశ్ కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు అంతర్జాతీయ స్థాయిలో ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంతో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయిలో కొత్తగా పరిచయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. దాదాపు ఈ చిత్రానికి 4వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. తాజా గ్లింప్స్ విడుదలతో ‘రామాయణం’పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్ విడుదల చేసి ఈ చిత్రంపై మరింత హైప్ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.