చలికాలంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గజగజ వణికించే చలిలో కాచి చల్లార్చిన నీటినే తాగాలి. వేడి ఆహారం మాత్రమే భుజించాలి. వెచ్చదనం పెంచే ఉన్ని దుస్తులు, రక్షణనిచ్చే స్వెట్టర్లు, మాస్కులు, గ్లౌజులు ధరించాలి. చిన్నారులతోపాటు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. శీతల వాతావరణం కారణంగా అలర్జీ, జలుబు బారిన పడే అవకాశం ఉన్నది
మహబూబ్నగర్ మె ట్టుగడ్డ, నవంబర్ 9 : ఇంట్లో కూర్చున్నా చలి వణికిస్తున్నది. బయట అడుగుపెట్టాలంటేనే ప్రజ లు గజగజలాడుతున్నారు. ఉమ్మడి జి ల్లాలో పది రోజులుగా చలి తీవ్రత పెరిగింది. స్వెట్టర్ వేసుకొని.. దుప్పటి కప్పుకు న్నా వణుకు ఆగడంలేదు. మిట్ట మధ్యాహ్నం కూడా చలి తీవ్రత ఉంటున్నది. దీంతో దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందిగా మారింది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, జ్వరం, ఆయాసం కేసులు పెరుగుతున్నాయి. ఆస్తమా, సీ వోపీడీ, అలర్జీ, బ్రంకైటిస్, నిమోనియా తదితర శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నారు.
రోగనిరోధక శక్తి తక్కువ గా ఉన్న వారిపై వైరస్ త్వరగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. శీతల వాతావరణం కారణంగా వద్ధులు అలర్జీ, బ్రంకైటిస్ బారినపడుతున్నారు. చలి ఉండడం వల్ల వైరస్ శక్తివంతమవుతున్నది. ఐదారు రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీ ప్రస్తుతం రెండు వారాలు ఉంటున్నది. చలి గాలుల వల్ల చర్మం తెల్లగా పొడిబారుతున్నది. పెదవులు, అరికాళ్లు పగులుతున్నాయి. ఈ క్రమంలో మధుమేహం రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆ స్తమా, నిమోనియా, సీవోపీడీ, గుండె వ్యాధులతో బాధపడేవారికి ఇది కష్టకాలమని పేర్కొంటున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్నా ఆస్తమా సమస్య పెరుగుతుందంటున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. వైద్యం ఆలస్యమైతే నీరు క్రమేణా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని పొరలు ఉబ్బిపోయి శ్వాసకష్టంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
చలి తీవ్రంగా ఉన్న సమయంలో శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. శ్వాసకోశ, ఈఎన్టీ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసి కాచి చల్లార్చిన నీటిని తాగాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. శరీరం పూర్తిగా కప్పేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పానీయాలు, ఐస్క్రీమ్లు తీసుకోవద్దు. గొంతునొప్పి ఉన్నవారు రోజూ రెండు సార్లు వేడిచేసిన నీటిలో కొంచెం ఉప్పువేసి పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా ఐదారు సార్లు చేయాలి. బయటి నీరు, ఆహారం తీసుకోవద్దు. ఫ్రిజ్ నీళ్లు అసలు తాగొద్దు. వేడి ఆహారమే తీసుకోవాలి.
– డాక్టర్ బాలశ్రీనివాస్, జనరల్ మెడిసిన్, ప్రభుత్వ జనరల్ దవాఖాన, మహబూబ్నగర్