మహబూబ్‌నగర్‌టౌన్, నవంబర్ 10 : ఉర్దూ భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట అల్నూర్ హైస్కూల్లో గురువారం ప్రపంచ ఉర్దూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ మహ్మద్ ఇక్బాల్ ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ ఉర్దూ దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మైనార్టీలకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. అలాగే మైనార్టీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
పోటీ పరీక్షలు ఉర్దూభాషలో ప్రభుత్వం నిర్వహించి ప్రోత్సాహం అందిస్తున్నదన్నారు. ఉర్దూ పాత్రికేయులకు అండగా ఉంటామని తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యుడు అన్వర్‌పాషా, ఉర్దూభాష అభివృద్ధి పోరాట కన్వీనర్ తఖీహుస్సేన్, అబ్దుల్‌హాది, గులాంగౌస్, మోసిన్‌ఖాన్, సలీం నవాబ్, ష బ్బీర్, ఇసా, అంజద్, అహ్మద్ సిద్దిఖీ, జాఫర్ పాల్గొన్నారు.