హైదరాబాద్ : మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, మీరు మనోధైర్యం కోల్పోవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్లోని దాసారం బస్తీలోని గుడిసె వాసులు వెస్ట్ మారేడ్ పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేని కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇంటూరి రమేష్, మరికొందరు వ్యక్తులు తమ బస్తీలో దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలను చేపట్టారని, అడ్డుకునేందుకు వెళ్లిన తమ బస్తీ వాసులపై కిరాయి రౌడీలను తీసుకొచ్చి దాడి చేయించి గాయపర్చారని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా దాసారం బస్తీలో ఆక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, SC, ST కమిషన్, మానవ హక్కుల కమిషన్ లకు లేఖలు రాశారు. 30 సంవతారాల నుండి ఇక్కడే గుడిసెలు వేసుకొని 300 నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని ఎమ్మెల్యే తలసాని లేఖలో వివరించారు. కొందరు వ్యక్తులు దౌర్జన్యం, దాడులకు పాల్పడి స్థానిక పేద ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
దాసారం బస్తీలో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన లేఖలలో కోరారు. కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, తిమ్మన్న, సూరి, రవి, తిరుమలయ్య, ఆదినారాయణ, దేవేందర్, రంగప్ప, స్వామి తదితరులు ఉన్నారు.