ఉమ్మడి మహబూబ్‌నర్ నెట్వర్క్, నవంబర్ 7;ఆలయాలకు కార్తీక శోభ సంతరించుకున్నది. పౌర్ణమి సందర్భంగా సోమవారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన శివాలయాలతోపాటు శైవ క్షేత్రాలైన జోగుళాంబ, ఉమామహేశ్వరంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 7: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అడ్డాకుల మండలకేంద్రంతోపాటు కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కోనేరులో గంగాదేవికి పూజలు చేసి ఆలయ ప్రాంగణం, కల్పవృక్షాల వద్ద దీపాలను వెలిగించారు. అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి ఆల మంజుల ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి అభిషేకం, అర్చన చేశారు.
మూసాపేటలో ..
మూసాపేట మండలంలోని పోల్కంపల్లి చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కార్తీపౌర్ణమి వేడుకను పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాలను వెలిగించి మొక్కలు చెల్లించుకున్నారు.
జిల్లాకేంద్రంలో..
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 7: జిల్లాకేంద్రంలోని మోనప్పగుట్ట అష్టలక్ష్మి మహిళా మండలి కమ్యూనిటీ భవనం, కలెక్టర్ బంగ్లా చౌరస్తాలోని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం మహిళాలు కార్తీక దీపారాధన చేశారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకుడు రాజ్‌కుమార్ దేవతమూర్తులకు పూలమాలవేసి పూజలు చేశారు. అనంతరం మహిళలు దీపాలను వెలిగించారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, నవంబర్ 7: పట్టణంలోని ఈశ్వరవీరప్ప ఆలయంలో సోమవారం మహిళలు కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అదేవిధంగా లక్ష్మీపల్లిలోని కనుకదుర్గ ఆలయంలో, చిన్నరాజమూరులోని ఆంజనేయస్వామి ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.
భూత్పూర్ మున్సిపాలిటీలో..
భూత్పూర్, నవంబర్ 7: మున్సిపాలిటీలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. మంగళవారం చంద్రగ్రహణం ఉండడంతో సోమవారం పూజలు చేశారు.