దేవరకద్ర రూరల్, నవంబర్ 1 :కురుమూర్తి రాయా గోవిందా.. నామస్మరణతో సప్తగిరులు మార్మోగాయి. కురుమతి రాయుడి బ్రహ్మోత్సవాలుఅంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి దాసంగాలు సమర్పించారు. గంటల తరబడి క్యూలో నిల్చొని దర్శనం చేసుకొని స్వామి దర్శనంతో తన్మయత్వం చెందారు. జాతర ప్రాంగణం కిటకిటలాడింది. శివసత్తుల పూనకాలతో భక్తిపారవశ్యం నెలకొన్నది. రద్దీతో జాతర జన సంద్రంగా మారగా.. కాంచనగుహ పులకించింది. గుడారాలతో జాతర మినీ మేడారాన్ని తలపించింది.
పేదల తిరుపతి.. పిలిస్తే పలికే దైవంగా పేరొందిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్నచింతకుంట మండలం అ మ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహలో భక్తుల కొంగుబంగారమైన కురుమతి రాయుడు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. సోమవారం జరిగిన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలిరాగా.. మంగళవారం రద్దీ కొనసాగింది. మ న రాష్ట్రంతోపాటు సమీప రాష్ర్టాల నుంచి భారీగా తరలివస్తుండడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎక్కడా చూసినా రద్దీతో భకఝరీని తలపించింది. గుడారాలతో జాతర మినీ మేడారాన్ని తలపించింది. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మట్టికుండల్లో దాసంగాలు సి ద్ధం చేసి కురుమూర్తి స్వామికి సమర్పించారు.
ప్ర త్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. భ క్తులు భారీగా రావడంతో కింది నుంచి కొండపై ఉన్న ఆలయం వరకు బారులుదీరారు. గంటల కొద్దీ క్యూలో నిల్చొని స్వామిని దర్శించుకున్నారు. కొందరు గండజ్యోతిని తలపై పెట్టుకొని కొండపైకి చేరుకున్నారు. స్వామి దర్శనంతో తన్మయత్వం చెందారు. శివసత్తులు పూనకాలతో భక్తిపారవశ్యం లో మునిగిపోయారు. స్వామి ఉద్దాలను తాకి పరవశించిపోయారు. అలంకార ప్రియా.. కురుమూ ర్తి రాయా.. గోవిందా.. గోవిందా.. నామస్మరణ మార్మోగింది. నినాదాలతో సప్తగిరులు పులకించాయి. ఎడ్లబండ్లు, ప్రత్యేక వాహనాలలో భక్తులు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా స్వామి సన్నిధిలో సేదతీరారు. కొందరు రాత్రిళ్లు అక్కడే బస చేశారు. జాతర ప్రాంగణంలో వెలిసిన దుకాణాల్లో మిఠాయి, ఆటవస్తువులు, గాజులు, దేవుడి చిత్రపటాలను కొనుగోలు చేశారు. చిన్నారులు, పెద్దలు ఉల్లాసంగా గడిపారు. ఆలయ కమిటీ, అధికారులు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేశారు. వేలాదిగా తరలొస్తున్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. భక్తులను విడుతల వారీగా స్వామి దర్శనానికి పంపించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది మెడికల్ శిబిరాలను ఏర్పాటు చేశారు.