ఓ వైపు నాలాల ఆక్రమణ..మరో వైపు జాతీయ రహదారి విస్తరణ మాటున కల్వర్టుల పూడ్చివేతతో పాలమూరుకు వరదగండం ఏర్పడింది. మొన్నటి వర్షానికి చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. తక్షణ సాయం చేసినా తాత్కాలికంగా ఉపశమనం కల్గడంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించారు. వరద పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి రూ.100 కోట్ల భారీ సాయం కోరడంతో నిధులు కూడా విడుదల చేశారు. దీంతో శాశ్వతంగా వరద ముప్పునుంచి పాలమూరును కాపాడేందుకు చర్యలు తీసుకోనున్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు పాలమూరు జిల్లా కేంద్రంలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఊహించని రీతిలో అనేక కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అధికార యంత్రాంగం యుద్ధప్రాపదికన సహాయ చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తప్పింది. బాధితులకు పునరావాస చర్యలు చేపట్టారు. పాలమూరులో లోతట్టు ప్రాంతాలు మునగడంపై అధికారులు అప్రమత్తమై ఇందుకు గల కారణాలపై ఆరా తీశారు. వర్షాలు వస్తే నీరు వెళ్లేందుకు ఉపయోగపడే నాలాల ఆక్రమణ, మురుగు కాల్వలన్నీ కుచించుకుపోవడంతో ఈపరిస్థితి తలెత్తిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధ్దారించారు. అంతేకాకుండా వర్షాల వల్ల కాలనీల్లోని రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హుటాహుటిన వరదకు చెక్ పెట్టేవిధంగా ఉన్నాతాధికారులలో సమీక్షించారు. శాశ్వత పరిష్కారం కోసం రూ. వందకోట్లు అవసరం అవుతాయని నివేదించగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో వరద సాయంగా రూ. వందకోట్లకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఎన్సీపీఈ అనే కన్సల్టెన్సీ సంస్థ తన ప్రత్యేక టీం ద్వారా జిల్లా కేంద్రంలోని ఎఫెక్టెడ్ ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించింది. మరో రెండు ప్రాంతాలను పరిశీలించి చేపట్టబోయే చర్యలపై మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు నివేదించనున్నారు.
గతంలో ఎన్నడు లేనంతగా రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రికి నివేదించడంతో ఎన్నడూలేని విధంగా జిల్లా కేంద్రానికి రూ. 100 కోట్ల భారీ వరద సాయం అందింది. పాలమూరు జిల్లా కేంద్రంలో అనేకమంది రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా వివిధ హోదాల్లో పనిచేసినా ఒక్క రూపాయి నిధులు వచ్చేవి కావు. జిల్లా కేంద్రానికి ఈ ఎనిమిదేండ్లలో సుమారు రూ.3వేల కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చుపెట్టారంటే సర్కార్ చిత్తశుద్ధి అర్థమవుతున్నది.
జిల్లా కేంద్రంలో ఎన్సీపీఈ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వార శాశ్వత పరిష్కారం దిశగా సర్వే చేపట్టారు. గత 50ఏండ్ల రికార్డులను పరిశీలించి పట్టణంలో వచ్చే నీటి ప్రవాహాన్ని లెక్కించి నీళ్లు ఎటువైపు పోతున్నాయో పూర్తి స్థాయిలో పరిశీలించి పలు కారణాలను విశ్లేషించి నివేదిక తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రగుంట, రామయ్యబౌలీ, వల్లభ్‌నగర్, కురివిశెట్టి కాలనీ, ఇతర ప్రాంతాల్లో సర్వే పూర్తి కాగా..బీకే రెడ్డి కాలనీ, పాతపాలమూరు ప్రాంతాలు మిగిలాయి.
జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అధికారులు పూర్తిగా సహకరిస్తుండటంతో అనుకున్న పనులు సాఫీగా జరుగుతున్నాయని కితాబు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఎంతో అనుభవం ఉన్న అధికారి. కిందిస్థాయి నుంచి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించడంతోపాటు తానే ముందుండి జిల్లా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు సైతం పోలీసు యంత్రాంగాన్ని మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో సఫలీకృతం అయ్యారు.
పాలమూరు జిల్లా కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని ఫ్లష్ప్లడ్ వల్ల భారీగా ఇబ్బంది అయింది. వరద ఊహించిన దానికంటే ఎక్కువగా ముంచెత్తింది. నాలాలు ఆక్రమణలు గురికావడం, చెరువులు, కుంటల కింద వచ్చిన వరద వచ్చినట్లే వెళ్లకుండా మురుగుకాల్వలను కూడా వదలకుండా ఆక్రమించినట్లు అధికారులు తేల్చారు. వీటన్నింటికీ పరిష్కరిస్తాం..పేదలు ఉంటే వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. జిల్లా కేంద్రంలో వరద పరిస్థితిని వివరిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో రూ.100 కోట్ల భారీ సహాయం ప్రకటించడమే కాకుండా నిధులు కూడ విడుదల చేశారు. మంత్రి కేటీఆర్ కూడా సహకరించారు. శాశ్వతంగా వరద ముప్పునుంచి పాలమూరును కాపాడుతాం.
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్,పర్యాటక శాఖ