సాధారణంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం సంభవించి గాయాలైన వ్యక్తులు కనిపిస్తే తక్షణమే గుర్తుకు వచ్చేది 108 అంబులెన్స్. కుయ్.. కుయ్.. అంటూ ప్రమాదస్థలానికి చేరుకొని క్షణాల్లో దవాఖానకు తరలించి తల్లీబిడ్డ ప్రాణాలు రక్షిస్తుంది వాహనం.. ఆన్లైన్లో డాక్టర్ సలహాలతో అంబులెన్స్‌లోనే వైద్య సేవలను అందించేలా
సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణులు డెలివరీకి వచ్చే సమయంలో అత్యవసర పరిస్థితుల మేరకు వాహనంలో మార్గ మధ్యంలోనే ప్రసవాలు చేస్తున్నారు. రెండు నెలల్లోనే 6 సాధారణ ప్రసవాలు చేశారు. దీంతో సేవలు పొందిన కుటుంబసభ్యుల నుంచి సిబ్బంది మన్ననలను పొందుతున్నారు.
వనపర్తి, అక్టోబర్ 30: ప్రమాదం ఏదైనా, తీవ్ర అనారోగ్యానికి గురైనా, మృత్యువుతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ మేమున్నామంటూ అండగా 108 సిబ్బంది సేవలను అందిస్తున్నారు. ఉదయం రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు అందుబాటు లో ఉంటూ ఫోన్ చేసిన 15 నిమిషాల్లో అక్కడకు చేరుకుని క్షత్రగాత్రులకు మార్గ మధ్యలోనే ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ నిమిషాల్లో దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు చేర్చి మెరుగైన వైద్య సేవలను అందించేలా 108 సిబ్బంది విధులను నిర్వహిస్తారు. రెండు నెలల్లో 6 నార్మల్ డెలివరీలను 108 సిబ్బంది చేశారు.
అత్యవసరంలో నార్మల్ డెలివరీలు
సాధారణంగా డెలివరీకి వచ్చిన గర్భిణులు పురిటి నొప్పులు వస్తున్న సమయంలో వారి బంధువులు ఆశ కార్యకర్త సహాయం తో 108 ఫోన్ చేస్తుంటారు. ఫోన్ కాల్ అందుకున్న 108 సి బ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గర్భిణిని దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తారు. తరలించే సమయంలోపురిటి నొప్పులు ఎక్కువైతే ఆశ కార్యకర్త సహాయంతో మహిళ గర్భం వివరాలు, పూర్తి స్థాయి రిపోర్టులను పరిశీలించి తక్షణమే ఆన్లైన్ ద్వారా ఈఆర్సీపీ వైద్యులకు సమాచారం ఇవ్వడంతో పరిస్థితులను పూర్తి స్థాయిలో వారికి వివరించడంతో వారి సలహాలు , సూచనలతో ఆశ కార్యకర్త సహకారంతో ఇంజెక్షన్లు, బీపీ చెకప్, గ్లూకోజు బాటిల్ వంటి వైద్యాన్ని అందిస్తూ నార్మల్ డెలివరీలు చేస్తారు. డెలివరీ అయిన వెంటనే నవజాత శిశువుకు ఉమ్మ నీరు తొలగింపుతో పాటు పూర్తిగా శుభ్రం చేసి వెచ్చగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మహిళకు అందించాల్సిన ప్రాథమిక వై ద్యాన్ని అందించి ప్రభుత్వ దవాఖానకు చేర్చి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు.
నార్మల్ డెలివరీలు అయ్యే క్షణాలు
సాధారణంగా మొదటి కాన్పు నార్మల్ డెలివరీ, మిగితా డెలివరీలు కూడా నార్మల్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటి డెలివరీ సమయంలో 6నుంచి 8గంటలు, పురిటి నొప్పులురాగా, రెండవ డెలివరీ సమయంలో 3నుంచి 5 గంటలు, మూడో డెలివరీ గంట నుంచి 3గంటలు పురిటి నొప్పులు వస్తాయి. సాధారణంగా పురిటి నొప్పులు వచ్చే సమయంలో గర్భిణులు వారి కుటుంబ పెద్దలకు చెప్పిన సమయంలో నార్మల్ డెలివరీ అవుతుందని చాలాసేపు వరకు ఇంట్లోనే ఉంచి నొప్పులు విపరీతం అయిన సందర్భంలో 108కు సమాచారం అందిస్తే సిబ్బంది అక్కడికి చేరుకుని దవాఖానకు తీసుకొచ్చే సమయంలో నొప్పుల తీవ్రతను బట్టి నార్మల్ డెలివరీలను సిబ్బంది చేయడం జరుగుతుంది.
వనపర్తి జిల్లాలో అందుబాటులో 7అంబులెన్సులు
జిల్లాలో 7 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. వనపర్తి జిల్లా దవాఖానతో పాటు రేవల్లి , పాన్‌గల్, కడుకుంట్ల, పెబ్బేర్, కొత్తకోట, ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయి. ఈ పీహెచ్సీ పరిధిలో ఉన్న గర్భిణులు ఫోన్ చేసిన వెంటనే అక్కడికి చేరుకుని వారిని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తారు.
అంబులెన్స్‌లో డెలివరీ అయిన వివరాలు కొన్ని..
27.09.2022 పాన్‌గల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన దస్తమ్మకు పురిటి నొప్పులు రాగా సాయంత్రం 108కి సమాచారాన్ని సాయంత్రం 4.22గంటలకు అందించగా ,108 సిబ్బంది అక్కడికి చేరుకుని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంజనగిరి సమీపంలో సాయంత్రం 4.55 గంటలకు నార్మల్ డెలివరీ కాగా మగబిడ్డ పుట్టాడు. అనంతరం అక్కడి నుంచి జిల్లా దవాఖానకు తరలించి తల్లీబిడ్డకు మెరుగైన వైద్యాన్ని అందించారు.
08.10.2022 పాన్‌గల్ మండలం దొండాయపల్లి గ్రామానికి చెందిన కవితకు పురిటి నొప్పులురాగా సాయంత్రం 108కి స మాచారాన్ని సాయంత్రం 5.02గంటలకు అందించగా 108 సిబ్బంది అక్కడికి చేరుకొని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంజనగిరి సమీపంలో సాయంత్రం 5.55 గంటలకు నార్మల్ డెలివరీ కాగా ఆడబిడ్డ పుట్టింది. అనంతరం పాన్‌గల్ పీహెచ్‌సీని తరలించి తల్లీబిడ్డకు మెరుగైన వైద్యాన్ని అందించారు.
20.10.2022 చిన్నంబావి మండలం వెల్టూర్ గ్రామానికి చెంది న అనురాధకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108కిసమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అమెను ఆసుపత్రి తరలించే సమయంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఇంటి దగ్గరే ప్రసవం చేశారు. అనంతరం వీపనగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అత్యవసరమైతేనే ప్రసవాలు చేస్తాం
పురిటి నొప్పులతో బాధపడుతున్న సమయంలో గర్భిణి కుటుంబసభ్యులు 108కు సమాచారాన్ని అందిస్తారు. తక్షణమే అక్కడికి చేరుకుని వారిని దగ్గరలోని ప్రభుత్వ దవా ఖానకు తరలిస్తాం. ఇలా తరలించే సమయంలో నొప్పులు ఎక్కవై డెలివరీ అయ్యే సూచనలు తెలిస్తే ఆన్లైన్లో ఈఆర్సీపీ వైద్యులకు గర్భిణికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిని వివరించి ఆశ కార్యకర్త సహకారం తో నార్మల్ డెలివరీ చేసి తల్లీబిడ్డను దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తాం.
– బాలరాజు, 108 జిల్లా కో ఆర్డినేటర్, వనపర్తి