జడ్చర్ల, అక్టోబర్ 30 : ఊరపందుల స్వైరవిహారంతో పంటలు నాశనమవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పంటలను పండించే రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. వరిపంట చేతికొచ్చే సమయంలో ఊరపందులు పాడు చేస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ శివారులో పంటలు సాగు చేసిన రైతులకు ఊరపందుల బెడద నెలకొన్నది. పట్టణంలో వందల సంఖ్యలో పందులు ఉన్నా పురపాలక సంఘం పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంలేదు. దీంతో పట్టణ శివారు ప్రాంతాల్లో సాగుచేసిన పంటచేల్లో పందు లు పడి నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటచేల్లో పందుల సంచారంతో వరిపైరు
నేలపాలవుతున్నది. అధిక వర్షాలతో పంటలు సరిగా పండక ఇబ్బందులకు గురవుతున్న రైతులకు పం దుల సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. రాత్రి, పగలు తేడాలేకుండా పం టచేల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట పందులపాలవుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందు ల నుంచి పంటలను కాపాడాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ పొలాల్లో ఊరపందులు సంచరించకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.