జడ్చర్ల/రాజాపూర్/బాలానగర్, అక్టోబర్ 30 : కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్ర పాలమూరు జిల్లాలో ముగిసింది. ఆదివారం ఉదయం జడ్చర్ల మండలం గొల్లపల్లి లలితాంబికా తపోవనం నుంచి ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభమైంది. దీంతో వాహనాలను నిలిపివేసి ఒకేరూట్లోకి మళ్లించారు. ఉదయం కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో 10 గంటల వరకు ట్రాఫిక్‌జామ్ అయ్యింది. దీంతో 10 కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 4 గంటలకుపైగా రాకపోకలు స్తంభించిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లాలోకి అడుగుపెట్టింది. బాలానగర్ మండలం పెద్దాయిపల్లి వద్ద ఏర్పాటు టెంట్వద్దకు యాత్ర చేరుకోవడంతో పోలీసులు రెండువైపులా నుంచి వాహనాల రాకపోకలను ప్రారంభించారు. సాయంత్రం 4గంటల నుంచి యాత్ర ప్రారంభం కావడంతో తిరిగి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు మళ్లీ నిలిచిపోయాయి. ఇదేం యాత్ర అంటూ ప్రయాణికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన జానారెడ్డి, మల్లురవి, రాహుల్‌తో పాటు నడుస్తుండగా వారు కింద పడబోయారు. వారిని పక్కన ఉన్న వారు పట్టుకున్నారు. దీంతో వారు నెమ్మదిగా పక్కకు వెళ్లిపోయారు.
అయితే రాహుల్ చప్పగా సాగింది. తెల్లవారకముందే వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యాత్ర వద్దకు చేరుకున్నా వారికి నిరాశే ఎదురైంది. రాహుల్ దరిదాపుల్లోకి వారిని రానీయలేదు. ఎక్కడా ఆగకుండా యాత్ర వెళ్లడంతో నాయకులు, ప్రజలు నిరాశ చెందారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులను, జనాలను రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తోసేశారు. దీంతో కొందరు కిందపడి గాయాలైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహిళలకు కూడా చుక్కెదురైంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ గైర్హాజర్ కావడంతో ఆయన అనుచురులు సైతం రాలేదు. సాయంత్రం 4 గంటలకు జోడోయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చేరింది.