ఆత్మకూరు, అక్టోబర్ 28 : తెలంగాణ ప్ర జల ఆరాధ్యదైవమైన కురుమూర్తి స్వామి బ్ర హ్మోత్సవాలు మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పేదల తిరుపతిగా పేరుగాంచిన స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘటమైన అలంకారోత్సవం 30వ తేదీన నిర్వహించనున్నారు. ఆత్మకూరు సంస్థానాధీశులైన ముక్కెర వంశస్తులు బహూకరించిన బంగారు ఆభరణాలను స్వామి వా రికి అలంకరించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. అలంకార మహోత్సవం ఆత్మకూరు పట్టణం నుంచి ఆరంభమవుతుంది. శతాబ్దాలుగా కు రుమూర్తి బ్రహ్మోత్సవాలకు, ఆత్మకూరుకు ఎ నలేని అనుబంధం ఉన్నది. సంస్థానాధీశుల కాలం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాల ఏ ర్పాట్లు, నిర్వహణ, ప్రధాన ఘట్టాలన్నీ ఆత్మకూరు నుంచే నిర్వహిస్తూ వచ్చారు. ఈ క్ర మంలో ఆత్మకూరు పట్టణం ముస్తాబైంది. ఆ త్మకూరు ఎస్బీఐ (పాత ఎస్బీహెచ్) నుంచి ఆదివారం ఆరంభమయ్యే వేడుకను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తాదులు వేలాదిగా తరలివస్తారు. బ్యాంకులోని ప్రత్యేక లాకర్లో భద్రపరిచిన స్వామి స్వర్ణాభరణాలకు ప్రత్యేక పూజలు చేసి బయటకు తీసుకొస్తారు. బ్యాంకు నుంచి కొండగట్టుకు చేరే వరకు ఆభరణాల ఊరేగింపునకు ప్రజలు నీరాజనాలు పలుకుతారు. ముక్కెర వంశరాజులు కురుమూర్తిస్వామి, లక్ష్మీదేవిలకు చే యించిన ఆభరణాలతోపాటు మాజీ ఎమ్మె ల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి బహూకరించిన ఆభరణాలను సైతం శోభాయాత్రగా కొండగట్టు మీదికి చేర్చనున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో స్వామివారి సేవల్లో అన్ని వ ర్గాల ప్రజలు భాగస్వాములు కానున్నారు. సాతానీలు (పూజారులు), దళితులు, దాసరులు, విశ్వకర్మలు, బేస్త లు, నాయీబ్రాహ్మణులు, పద్మశాలీలు.. ఇలా అన్ని కులాల వారు సేవలు చేయనున్నా రు. కాగా, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆత్మకూరు పట్టణమంతా ఫ్లెక్సీలు, బ్యా నర్లతో నిండిపోయింది. ఆభరణాల ఊరేగిం పు సాగే ప్రధాన రహదారి పొడవునా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులందరూ పోటాపోటీగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. పట్టణమంతా జాతర శోభ సంతరించుకున్నది. అ లంకారోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం అ న్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఐ కేఎస్త్న్రం, ఎస్సై పుట్టా మహేష్‌గౌడ్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు. ఇదిలా ఉండగా, మున్సిపాలిటీకి పన్ను చెల్లించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆనవాయితీగా ఆభరణాల ఊరేగింపు..
స్వామివారి ఆభరణాల ఊరేగింపు అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలతోనే కా కుండా ఆచార వ్యవహారాలతో ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆత్మకూరులోని ఎస్బీఐలో భద్రపరిచే స్వర్ణాభరణాలకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అ ధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి బయటకు తీసుకొస్తారు. స్థానిక విశ్వకర్మలు, గాడి వంశస్తులు వాటిని తలపై పెట్టుకొని పట్టణం లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆత్మకూరు పట్టణ శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్టపై స్వామికి అభిముఖంగా ఆభరణాలను ఉంచి పూజలు చే స్తారు. ఆ తరువాత ఆత్మకూరు నుంచి బయలుదేరి.. దుప్పల్లి మీదుగా ఆభరణాల ఊరేగింపు కొనసాగుతుంది. కురుమూర్తి రాయు డి సోదరుడైన బుగులు రాయుడు వెలసిన దుప్పల్లిలో పూజలందుకొని సంస్థానాధీశులైన అమ్మాపురం రాజా స్వగృహానికి ఆభరణాలు చేరుకుంటాయి. రాజావారి స్వగృహంలో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. సంస్థానాధీశుల ఆధ్వర్యంలో ఆభరణాలను కొండపైకి చేర్చుతారు. ఇలా అ నేక చరిత్ర, సాహిత్యపరంగా ఆచార వ్యవహరాలతో ఆభరణాల అలంకారం జరుగుతుం ది. అలాగే బ్రహ్మోత్సవాల్లోని పలు ఘట్టాల న్నీ ఆది నుంచి ఆచారవ్యవహారంగానే కొనసాగుతున్నాయి. చిన్నచింతకుంట పల్లమరి గ్రామం నుంచి మ్యాదర్లచే చాట తయారీ, అప్పంపల్లి గ్రామం నుంచి కుమ్మరులచే కలికుండ, అమరచింత నుంచి పద్మశాలీలచే పట్టువస్ర్తాలు, వడ్డెమాన్ గ్రామం నుంచి హరిజనులచే ఉద్దాల పాదుకల ఏర్పాట్లన్నీ ఆచార వ్యవహారంగానే కొనసాగుతాయి.
200 ఏండ్లుగా స్వామి సేవలో..
200 ఏండ్లకు పైగా గాడి వంశస్తులమైన మేము కురుమూర్తిస్వామి సేవలో ఉన్నాం. స్వామి స్వర్ణాభరణాలను మా పూర్వీకులే తయారుచేశారు. మా తాతముత్తాతల నుంచి సంస్థానపరంగా విశ్మకర్మలకు సంక్రమించిన గౌరవంగా స్వామి సేవకు మేము అంకితమయ్యాం. ఈ ఏడా ది స్వర్ణాభరణాల మరమత్తులు, రీ మేకింగ్, పాలిషింగ్ చేశాం. మొత్తం 13 కుటుంబాలు కలిగిన మా వంశంలో వివాహమైన వారిని స్వర్ణాభరణాల పెట్టెను మోసేందుకు అనుమతిస్తాం. ప్రతి ఏడాది ఓ కుటుంబానికి చెందిన వ్య క్తి అలంకార మహోత్సవంలో పాల్గొంటారు. ముక్కెర వంశ రాజుల సహృదయభావంతో మాకు స్వామి సేవా భాగ్యం దక్కింది.
– గాడి లక్ష్మీనారాయణ, ఆత్మకూరు