మహబూబ్‌నగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు జిల్లా కేంద్రాన్ని అతలాకుతలం చేసిన వరదలకు చెక్ పెట్టేందుకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. వరదల నుంచి శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరిపాలనా అనుమతులను ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని వెంటనే నిధులు విడుదల చేయడంతో శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన జీవో కాపీని మంత్రి మీడియాకు విడుదల చేశారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలతో సహా అనేక చోట్ల రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. ఈనేపథ్యంలో జిల్లా అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష నిర్వహించి శాశ్వత ముప్పు తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. ఎన్ని నిధులు అవసరమో.. ఆరా తీశారు. పాలమూరుకు జరిగిన నష్టాన్ని.. ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం తక్షణ వరద సాయంగా నిధులు మంజూరు చేశారు. త్వరలో మున్సిపాలిటీలో పర్యటించి చేపట్టాల్సిన పనులను గుర్తించి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రణాళిక సిద్ధం చేసి పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతామని చెప్పారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.