మక్తల్ అర్బన్, అక్టోబర్ 27: మక్తల్ మున్సిపాలిటీలో సర్వేనెంబర్ 7లో ఇంటిగ్రేటెడ్ పనులు త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ దవాఖానలో రోగులకు సరైన వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ కోయ హర్ష సూచించారు. గురువారం మక్తల్ మున్సిపల్ కార్యాలయం, కర్నెరోడ్డులోని డంపింగ్ యార్డు, సర్వే నెంబర్ 7లో 1.5ఎకరాల్లో రూ.2కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులతో పాటు బిల్డింగ్ మ్యాపును పరిశీలించారు. అదేవిధంగా మక్తల్ ప్రభుత్వ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు డిసెంబర్ వరకు పూర్తి చేయాలని తెలిపారు. హరితహారానికి ఆయుర్వేద నర్సరీలో మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
విద్యార్థుల యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎంఈవోలు, మండల సెక్టోరియల్ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉన్న పాఠశాలల్లో, ప్రతిరోజు విద్యార్థులు వచ్చేలా సీఆర్పీలు కృషి చేయాలన్నారు.
సామర్థ్యాలు వెలికితీయాలి
విద్యార్థుల సామర్థ్యాలు వెలికితీసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ హర్ష అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాల, మండలంలోని మాద్వార్ ప్రాథమిక పాఠశాలను ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనుల్లో భాగంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి విద్యాప్రమాణాలు పరిశీలించారు. మక్తల్ కేజీబీవీలో సమస్యలను ఎస్వోను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్పర్సన్ అఖిల, కమిషనర్ మల్లికార్జునస్వామి, మున్సిపల్ ఏఈ నాగశివ, వైద్యలు పార్వతి, శ్రీకాంత్, కౌన్సిలర్ రాములు, యాదగిరి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్, ఇన్చార్జి డీఈవో గోవిందరాజులు, ఏఎంవో విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్, మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, జీడీసీ పద్మా, నళిని పాల్గొన్నారు.