కృష్ణా నీటిని అడ్డగోలుగా తరలిస్తూ తెలంగాణ రైతుల నోర్లు కొడుతున్నరు. తెలంగాణ పొలాలు బీడుగా మారుస్తున్నరు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం ఏమిటి? రేవంత్, కిషన్‌రెడ్డి కలిసి తెలంగాణ బొండిగె పిసుకుతరా? ఇద్దరు కేంద్రమంత్రులు ఏం చేస్తున్నట్టు? కేఆర్ఎంబీపై కనీసం రివ్యూ చేయరా? చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు కానీ రాష్ట్ర హకులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నరు?
-హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఏపీ సర్కార్ కృష్ణా జలాలను అడ్డగోలుగా కొల్లగొడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నట్టు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇండ్లెంట్లు, బోర్డు అనుమతులు లేకుండా అక్రమంగా.. అప్పనంగా 80 శాతం నీళ్లను తరలించుకుపోతుంటే కండ్లు మూసుకున్నరా? అని మండిపడ్డారు. జనవరి 28 నాటికే ఏపీ 664 టీఎంసీలు వాడుకున్నదని, ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని, వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడీని ఆపాలని తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాసినా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణాబోర్డు పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. ఇప్పటికీ ఏపీ ప్రతిరోజూ శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి ఒకటిన్నర టీఎంసీల నీటిని అప్పనంగా తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లప్పగించి చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఎందుకు అడగడం లేదు? ఆర్ఆర్ ట్యాక్స్ ఎకడ బయటకు వస్తదో, సామ్‌లు ఎకడ బయట పడుతయోనని భయపడుతున్నారా?’ అని ప్రశ్నించారు.
తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరు? కేఆర్ఎంబీని ఎందుకు నిలదీయరు?’ అని ప్రశ్నించారు. తక్షణమే ఏపీ నీళ్ల తరలింపును అడ్డుకోవాలని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైనున్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని, త్వరలో కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, పార్టీ నేత బొమ్మెర రామ్మూర్తితో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ అప్పనంగా తీసుకుపోతున్నా జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చోని సీఎం కండ్లప్పగించి చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఊరికే రాజకీయ ఆరోపణలు చేయడం లేదని, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నానని, ఇందుకు సంబంధించిన లేఖలను మీడియాకు చూపించారు.
తాతాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నదని, ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని తెలంగాణ ఇరిగేషన్‌శాఖ శాఖ ఈఎన్సీ జనవరి 28న కేఆర్ఎంబీకి లేఖ రాశారని హరీశ్ చెప్పారు. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి, ఏపీ నీటి దోపిడీని ఆపాలని ఈఎన్సీ రాసిన లేఖను మీడియాకు అందించారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారని, గాడిద పండ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. లేఖ రాసిన ఈఎన్సీ జనవరి 31న రిటైర్ అయ్యారని, లెకకు మించిన నీళ్లు ఏపీ తీసుకుపోతుంటే వారం దాకా ఆ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయలేదని, ఇన్చార్జి బాధ్యతలు మరెవరికీ అప్పగించలేదని విమర్శించారు. ‘కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఈఆర్ఎంబీ) సభ్యుడు అయిన ఈఎన్సీ పోస్టును ఎందుకు ఖాళీగా పెట్టారు? వాటా కుదరలేదా? కమీషన్లు కుదరలేదా?’ అని ప్రశ్నించారు. వారం తర్వాత మీడియా ప్రశ్నిస్తే అప్పుడు ఆ పోస్టు నింపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై సర్కార్ ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు.

బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ 66 శాతమే నీటిని వాడాల్సి ఉన్నదని, కానీ, ఈ వాటర్ ఇయర్లో జనవరి 29 నాటికే 664 టీఎంసీలు (80 శాతానికిపైగా) నీటిని తరలించుకుపోయిందని హరీశ్ విమర్శించారు. అయినా రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువు చంద్రబాబు అంటే రేవంత్‌కు భయమని, అందుకే ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడుగడం లేదని దుయ్యబట్టారు. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే శ్రీశైలం, సాగర్ జలాశయాలు ఖాళీ అవుతుంటే ఈ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని మండిపడ్డారు. ఎండలు ముదురుతున్నాయని, తెలంగాణకు పారిశ్రామిక, వ్యవసాయ, తాగునీటి అవసరాలు ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణ అవసరాలు పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. తాతాలికంగా అయినా మన రాష్ట్రానికి 174 టీఎంసీలు (34 శాతం నీటి వాటా) వాడుకునేది ఉన్నదని, అయినా వినియోగించుకున్నది 20 శాతం వాటా మాత్రమేనని విమర్శించారు. ఏపీ ఇప్పటికీ అక్రమంగా రోజూ 1.5 టీఎంసీల నీళ్లు తీసుకుపోతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మన పంటలు ఏం గావాలె? మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం గావాలె? సరార్ నడుపుతున్నరా? సరస్ నడుపుతున్నరా?’ అని మండిపడ్డారు.
కృష్ణా జలాల వినియోగంలో బీఆర్ఎస్ పాలనతో పోల్చితే కాంగ్రెస్ హయాంలోనే అతి తక్కువ వాడుకుంటున్నామని హరీశ్ విమర్శించారు. వరుసగా రెండేండ్లుగా అతి తకువ కృష్ణా జలాలను వాడుకుంటూ చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ఆధారాలతోసహా వివరించామని, అయినా, ఈ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో 45 శాతం, 35 శాతం వాడితే, రేవంత్‌రెడ్డి పాలనలో ఈ ఏడాది కూడా 20 శాతం నీటి వాటా దాటలేదని విమర్శించారు. ఇది ముఖ్యమంత్రి వైఫ్యల్యానికి నిదర్శనమని, ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పాలిట శాపంగా మారాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లే దయ్యమైనట్టు హకులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే తెలంగాణ హకులను కాలరాస్తున్నారని వాపోయారు. ‘పాలన మీద పట్టు లేదు.. పట్టింపు కూడా లేదు’ అని మండిపడ్డారు. ‘కేఆర్ఎంబీకి లేఖ రాసి మేం చెప్పిన ఏపీ నీటి వినియోగం వాస్తవం అని ఒప్పుకొన్నరు. ఏపీ అడ్డగోలుగా నీళ్లు వాడుతున్నది అడ్డుకోవాలని ఇప్పుడు కేఆర్ఎంబీకి లేఖ రాసిండ్రు. మేం ప్రశ్నించినప్పుడే మీరు నిద్ర లేచి బాధ్యతగా వ్యవహరించి ఉంటే తెలంగాణకు ఇంత నష్టం అవుతుండేనా? నామమాత్రంగా లేఖ రాయడం తప్ప మీరు చేస్తున్నదేం లేదు. తెలంగాణ కోసం మమ్మల్ని తిట్టినా పడుతం. కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లితే మాత్రం ఊరుకోబోం’ అని హెచ్చరించారు.
తాతాలిక ఒప్పందాన్ని (66:34) దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నదని, ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందని తెలంగాణ ఇరిగేషన్‌శాఖ శాఖ ఈఎన్సీ జనవరి 28న కేఆర్ఎంబీకి లేఖ రాసిండ్రు. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి, ఏపీ నీటి దోపిడీని ఆపాలని కోరిండ్రు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నరు?
-హరీశ్‌రావు
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఏపీ నీళ్ల దోపిడీని, అక్రమ తరలింపును వెంటనే అడ్డుకోవాలని హరీశ్ డిమాండ్ చేశారు. ‘ఎంతసేపూ కేసీఆర్ మీదపడి ఏడ్వడం కాదు.. ఆ కుర్చీల్లో కూర్చున్నందుకు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైనున్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలి. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్‌ను ముట్టడిస్తాం. కేంద్ర మంత్రిని కూడా కలుస్తాం. పార్లమెంట్లో ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి తెలంగాణ హకులను కాపాడటంలో ఫెయిల్ అయ్యారు. తెలంగాణ నీటి హకుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తది’ అని స్పష్టంచేశారు. 19 ప్రాంతాల్లో బీఆర్ఎస్ టెలిమెట్రీలు పెట్టిందని, మిగతా 9 ప్రాంతాల్లో పెట్టాలని కోరామని గుర్తుచేశారు. టెలిమెట్రీలు పెట్టకపోగా, ఇందుకోసం కేటాయించిన నిధులను కేంద్రం వాడుకున్నా ప్రశ్నించడంలో రేవంత్‌రెడ్డి సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. ప్రాజెక్టులు, ఆయకట్టు అదనంగా అందుబాటులోకి వచ్చినా నీటి వాడకంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.
664 టీఎంసీలు ఏపీ తీసుకుపోయిందని ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాస్తే, కేఆర్ఎంబీ రాసిన లేఖలో 555 టీఎంసీలు తీసుకుపోయిందని ప్రస్తావించిందని, వంద టీఎంసీలు తకువ చేసి చెప్తున్నదని హరీశ్ విమర్శించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడగడం లేదని, హకులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ ఏపీని ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ చేతిలో ఉన్న కేఆర్ఎంబీ తీరుపై రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
‘కేసీఆర్ మీద పడి ఏడ్వడం తప్ప.. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరు? కేఆర్ఎంబీని ఎందుకు నిలదీయరు?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఆర్ఆర్ ట్యాక్స్ ఎకడ బయటకు వస్తదో, సామ్‌లు ఎకడ బయట పడుతయోనని రేవంత్ మౌనంగా ఉంటున్నడు. బీజేపీ కూడా అట్లాగే మౌనంగా ఉంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నయి. అడ్డగోలుగా ఏపీకి నీళ్లు తరలిస్తూ తెలంగాణ రైతుల నోర్లు కొడుతున్నరు. తెలంగాణ పొలాలు బీళ్లుగా మారుస్తున్నరు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న బంధం ఏమిటి? రేవంత్, కిషన్‌రెడ్డి కలిసి తెలంగాణ బొండిగె పిసుకుతరా? ఇద్దరు కేంద్రమంత్రులుండీ ఏం చేస్తున్నట్టు? కేబీఆర్ఎంబీపై కనీసం రివ్యూ చేయరా? చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు కానీ రాష్ట్ర హకులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నరు. బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ధ్వజమెత్తారు.
