పాలమూరు, అక్టోబర్ 27 : మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ను ఎర వేసి కొనుగోలు చేశారని.., ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు స్కెచ్ వేశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చౌ టుప్పల్ మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలను నిరసిస్తూ నల్లచొక్కా ధరించారు. ఈ సందర్భంగా మంత్రి మాటాడుతూ అప్పుడు చంద్రబాబు.. రేవంత్‌రెడ్డి ద్వారా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయ్యారన్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు, పీఎం మోదీ సైతం అదే స్కెచ్‌ను పన్నారన్నారు. రాజ్యాంగాన్ని అపహా స్యం చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారన్నారు. రాజగోపాల్‌రెడ్డి లాంటి దుర్మార్గులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో ఎవరూ లేరన్నారు. అదానీ, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎదుట బీజేపీ కుప్పిగంతులు సాగవన్నారు. దేవుడి పేరిట యువతను మభ్యపెట్టాలని చూస్తున్న బీజేపీ తీరు బండారం కావడం తో ఆ పార్టీకి దూరమవుతున్నారన్నారు. గొర్రెల పథకం లబ్ధిదారుల ఖాతా ల్లో ప్రభుత్వం జమ చేసిన సొమ్మును ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిలిపివేశారని.., యాదవులకు మంజూరైన నిధులు వారి ఖాతాల్లోంచి తీసుకునే అధికారం ఎవరికీ లేదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.