వెలుగు జిలుగుల దీపావళి వచ్చేసింది. సరదాలు.. సంబురాలు.. చిటపటలాడే పటాకులు.. సయ్యని వెళ్లే రాకెట్లు.. చిచ్చుబుడ్ల జిగేళ్లు.. విష్ణుచక్రాల కాంతులు.. కితకితలు పెట్టే భూచక్రాలు.. కొత్త బట్టల మెరుపులు.. మిఠాయిలు ఘుమఘుమలు.. ఇలా చిన్నా పెద్ద అందరూ సరదాగా గడిపే పటాకుల పండుగ.. సోమవారం పండుగను కనుల పండువగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. పటాకులు, స్వీట్ల దుకాణాలు, బస్టాండ్లు కిటకిటలాడుతుండగా.. షాపింగ్ మాల్స్ జనాలతో నిండిపోయాయి. సూర్యగ్రహణం నేపథ్యంలో నోములు, వ్రతాలు బుధవారం నుంచి నిర్వహించుకోవాలని పండితులు సూచించారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మార్కెట్లు సందడిగా మారాయి. దీపాలు, బంతిపూలు, స్వీట్లు, పటాకులతోపాటు బంగారు ఆభరణాలు కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో మార్కెట్లు కస్టమర్లతో కిక్కిరిసిపోయాయి. కొత్త బట్టలు కొనుగోలు చేయడానికి పాలమూరు, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లా కేంద్రాల్లోని షాపింగ్‌మాల్స్ కిటకిటలాడుతున్నాయి. పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీపావళికి స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఊపందుకున్నాయి.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రామ్‌మందిర్, పాన్‌చౌరస్తా, క్లాక్ టవర్ ప్రాంతాల్లోని దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీపాలు, బంతిపూలు, మల్లెలు, గులాబీ పూలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వివిధ రకాల ప్రమిదలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వివిధ డిజైన్లతో కూడిన మట్టి ప్రమిదలను మహిళలు ఎక్కువగా కొంటున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా అన్ని రకాల వస్తువల ధరలు అమాంతం పెరిగాయి. ఏం కొందామన్న ధరలు అందుబాటులో లేవని కస్టమర్లు వాపోతున్నారు. బంతిపూల దండ గతేడాది రూ. 30కే వస్తే ఈసారి రూ. 50 వరకు ధర ఉందని వినియోగదారులు చెబుతున్నారు. కేజీ బంతిపూలు గతేడాది రూ. 60కే ఇస్తే ఈసారి రూ.80 నుంచి 100కు పైగా అమ్ముతున్నారు. ప్రమిదలు కూడా రూ.10కే నాలుగు వస్తే..ఈసారి రూ.10కి రెండే ఇస్తున్నారు. డిజైన్లను బట్టి ప్రమిదల్లో కూడా ఎక్కువ ధరలు ఉన్నాయి.
దీపావళి పండుగకు బహుమతులు ఇవ్వడం మన సంప్రదాయం. వాటిలో తప్పనిసరిగా నోటిని తీపిగా చేసే మిఠాయిలు ఉండాల్సిందే. లక్ష్మీపూజ చేసే ప్రతిచోట మిఠాయి తీయదనం పంచుతూనే ఉంటుంది. దీపావళికి మార్కెట్లోని మిఠాయి దుకాణాలన్నీ అలంకరించి రారమ్మని ప్రజలను ఆహ్వానిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, వివిధ వ్యాపార సంస్థలు తమ వినియోగదారులకు, దగ్గరి వారికి మిఠాయిల గిఫ్ట్ బాక్స్ పంపి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఇండ్లలో పూజలు చేసే ప్రజలు కూడా బంధుమిత్రులకు మిఠాయి బాక్స్‌లు బహుమతిగా పంపుతుంటారు. స్వీట్లు కూడ కేజీ..రూ.400 ఉంటే ఈసారి రూ. ఆరువందలకు పెరిగింది. మిఠాయిలను బట్టి వివిధ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. పేనీ కేజీ రూ.150 ఉంటే ఈసారి రూ.200కు పెరిగింది.
కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఇచ్చి షాపింగ్ మాల్స్ ఆకర్షిస్తున్నాయి. పెద్ద హోర్డింగ్‌లతో ప్రచారం చేస్తుండటంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి మాల్స్‌కు తరలివస్తున్నారు. దీంతో మాల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీపావళీకి ఆఫర్లు ఇస్తుండటంతో పెద్ద మొత్తంలో షాపింగ్ చేస్తున్నారు. అంతేకాక బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ. 100తగ్గింపు, తరుగు చార్జీలు మాఫీ చేయడంతో చాలామంది బంగారు ఆభరణాలు కొంటున్నారు. దీంతో పాలమూరు జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్, పాన్‌చౌరస్తా, ఇతర నగల దుకాణాలు కిటకిటలాడుతన్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో కూడా నగలను అమ్ముతుండటంతో కస్టమర్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు.