ఆదివాసీ ఆడబిడ్డల తాగునీటి గోసకు చెక్ పడింది. చేతిపంపులు,బోర్లు, వ్యవసాయ పొలాలు, వాగుల వద్దకు పరుగులు పెట్టే గిరిజనానికి నీటి కష్టాలు తొలిగాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన సర్కార్ తాగునీటికి శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచుగూడేల్లో శుద్ధజలాలు సరఫరా అవుతున్నాయి. ఇంటింటికీ నల్లా నీరు అందుతున్నది. గతంలో కలుషిత నీటితో రోగాలు వచ్చేవని.. నేడు సీఎం కేసీఆర్ పుణ్యమా అని స్వచ్ఛమైన నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అచ్చంపేట, అక్టోబర్ 19 : ‘మారుమూల ఏజెన్సీ గిరిజన గూడేలు, తండాలను తాగునీటి సమస్య ఏండ్ల తరబడి పీడించింది. గిరిజన ఆదివాసీ బిడ్డలు బిందెలు పట్టుకొని బావులు, బోర్లు, వ్యవసాయపొలాలు, వాగులు, చెరువులకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలకు చెక్ పడింది. నీళ్ల కోసం కోట్లాటలు బంద్ అయ్యాయి. వేసవి వచ్చిందంటే సమస్య ఇంకా తీవ్రంగా ఉండేది. కుటుంబంలో ఉన్నవారందరూ నీళ్ల కోసం తిప్పలు పడేవారు. నీళ్ల కోసమే ఎక్కువ సమయం కేటాయించేవారు. చేతిపంపులు, వ్యవసాయ బోర్లు, వాగులు, చెలిమలలో నీటిని తాగి రోగాల బారిన పడేవారు.
’ దీనికంతటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగరథనే స్వస్తి పలికిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొండలు, గుట్టలు, అడవులు దాటి తండాలు, చెంచుగూడెంలకు పైపులైన్లు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ పుణ్యామా అంటూ నేడు అలాంటి సమస్య లేదు. మిషన్ భగరథ ద్వారా అమృతజలం అందుతున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ వంటి అటవీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలు, తండాలలో మిషన్ భగీరథ ద్వారా పుష్కలమైన నీళ్లు అందుతున్నాయి. అచ్చంపేట మండలం బక్కాలింగాయపల్లి, పదర మండలం మద్దిమడుగు, లింగాల మండలం ఎర్రపెంట వంటి చివరి గ్రామాలకూ నీరు చేరుతున్నది. మిషన్ భగీరథతో మంచి రోజులొచ్చాయని చెంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోగాలు కూడా రావడం లేదని చెబుతున్నారు.
గతంలో ఎడ్ల బండిపై డ్రమ్ములు పెట్టుకొని చెలుక చెలుక తిరిగి నీటిని తెచ్చుకునేటోళ్లం. పొలాల వాళ్లు నీళ్లు ఇచ్చేందుకు సంశయపడేటోళ్లు. చేనుకు పారించనిక్కె ఇబ్బందైతదని నీళ్లు ఇచ్చేవారుకాదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథతో నేడు ఆ కష్టాలన్నీ తీరినయి. ప్రతి రోజూ ఉదయాన్నే రెండుగంటలపాటు నీళ్లు వస్తున్నాయి. ఇంటింటికీ నల్లాలు బిగించడంతో గోస తప్పింది.
– బుజ్జి, గిరిజన మహిళ
మా చెంచు గూడెంలలో ఇంటింటికీ నీళ్లు వస్తవనుకోలే. పైపులు వేసి నీళ్లు వదులుతున్నారు. ఎండాకాలం వస్తే పెంటలు ఖాళీ చేసి నీళ్లు ఉన్న చోటుకు పోయెటోళ్లం. నేడు అన్ని పెంటలలో ఇంటింటికీ నల్లాలు బిగించారు. భౌరాపూర్‌లో చెరువు వద్ద బోరు వేసి పైపులు పరిచారు. సోలార్పె ట్టి నీళ్లు వదులుతున్నారు. ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు వస్తున్నాయి. ఇంటికి నల్లాలు బిగించడంతో ఇంకా మేలైంది. – ఎల్లమ్మ, వార్డు సభ్యురాలు, అప్పాపూర్ చెంచుపెంట, లింగాల మండలం
దట్టమైన అటవీ ప్రాంతంలోకి బయటి నుంచి మిషన్ భగీరథ పైపులైన్ తీసుకెళ్లడం కుదరదని అటవీశాఖ అడ్డంకులు సృష్టించింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో నష్టం వాటిల్లుతుందని అనుమతి ఇవ్వలేదు. చెం చులు తరతరాలుగా వాగులు, చెలిమల నీటిని తాగి రోగాల బారిన పడేవారు. కనీసం తాగునీటి ని ఇవ్వలేకపోతున్నామనే బాధ కలిగింది. చెంచు పెం టలకు కూడా ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు వివరించాను. నల్లమల ప్రాంతంపై ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉ న్నది. దీంతో నివేదిక తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అటవీశాఖకు నష్టం వాటిల్లకుండా ప్రతి చెంచుపెంటలో సోలార్ ద్వారా బోర్లు వేసి, ట్యాంక్‌లు ఏర్పాటు చేశాం. పైపులైన్ ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని అందించి శాశ్వత పరిష్కారం చూపించాం. చాలా సంతోషంగా ఉన్నది.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే
నల్లమలలో అడవితల్లిని నమ్ముకొని జీవనం గడుపుతున్న ఆదివాసీ చెంచులు కలుషిత నీటిని తాగి మృ త్యువాతపడిన సందర్భాలు అనేకం. వాగులు, వం కలు, చెలిమలలో నిల్వ ఉండి జంతువులు తాగే నీటినే సేవించి జీవనం సాగించారు. అయితే, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం కావడంతో మిషన్ భగీరథకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈ విషయాన్ని అనేక సార్లు సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం కేసీఆర్ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. మిగిలిపోయిన 16 గ్రామాలు, చెంచు పెంటలకు రూ.12 కోట్లు మంజూరు చేశారు. దీంతో అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట, ఈగలపెంట, పాతాళగంగ, కుమ్మనిపెంట, కొల్లంపెంట, సార్లపల్లి, కుడిచింతలబైలు, ఫ రహాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, వటువర్లపల్లి, లింగాల మండలంలోని మొడిమొల్కల, ఆగర్లపెంట, అప్పాపూర్పెంట, భౌరాపూర్, ఈర్లపెంట, సంగడి గుండాలు, రాంపూర్ పెంటలలో ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం చేరుకున్నది. సౌరవిద్యుత్ ద్వారా బో రువేసి, మోటారు బిగించి, ట్యాంక్ ద్వారా పైపులైన్ వేసి ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలం అందిస్తున్నా రు. ఈర్లపెంటలో ఊటబావికి మోటారు బిగించి ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణా ల నుంచి మారుమూల ప్రాంతం వరకు ప్ర తిపల్లె, గ్రామం, తండా, గూడెంలకు శుద్ధజలం అందుతున్నది. దశాబ్దాలుగా పీడిస్తు న్న తాగునీటి సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించడంతో గిరిజనులు, ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నీళ్లు లేక ట్యాంకర్ల నీటిని కొనుక్కునేవాళ్లం. ఎండాకాలం వస్తే ఆడవాళ్లందరూ కొట్టుకునేవాళ్లు. పంట పొలాలకు వెళ్లి బిందెపై బిందె పెట్టుకొని రెండు కిలోమీటర్ల నుంచి నీళ్లు తెచ్చుకునెటోళ్లం. ఇప్పుడు ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు రావడంతో ఆ సమస్య తీరింది. రోజూ నల్లా వస్తున్నది. ఇండ్లకాన్నే నీళ్లు పట్టుకుంటున్నాం. తాగేందుకు, స్నానానికి, పశువులకు ఈ నీటినే వాడుతున్నాం. చాలా సంతోషంగా ఉన్నది.
మా తండాలో నీళ్లులేక చాలా ఇబ్బంది పడెటోళ్లం. బోరింగులు కొట్టీకొట్టి చేతులు కాయలు కాసేవి. గంట కొడితే ఒక్క బిందె నిండేది. ఎండాకాలంలో ఇంకా ఇబ్బందయ్యేది. నీళ్లువచ్చేవి కావు. వాగుల్లో పారుతున్న నీటిని తెచ్చుకునేవాళ్లం. రోగాలు వచ్చేవి. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా బిగించారు. స్వచ్ఛమైన నీళ్లు వదులుతున్నారు. నీళ్ల బాధ తప్పింది.
నాగర్‌కర్నూ ల్ జిల్లాలోని 20 మం డలాల పరిధిలో 280 గిరిజన ఆవాస గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో 205 ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించారు. 300 కి లోమీటర్ల మేర ఇంటర్నల్ పైపులైన్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 24 వేల చెంచు కుటుంబాలకు శుద్ధజలం అందుతున్నది. 92 వేల జనాభాకు 24 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం రెండు దఫాలుగా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 100 శాతం గిరిజన ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందుతున్నది. ఫిల్టర్ చేసిన నీటిని క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ వంటి పక్రియ ద్వారా మరింత శుద్ధిచేసి ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. మిషన్ భగీరథ నీటినే తాగడానికి, స్నానానికి, మూగజీవాలకు వినియోగిస్తున్నారు. కాగా, జిల్లాలోని ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య తీరింది. గతంలో బోర్లు, చేతిపంపులు చెడిపోతే అధికారులు, సర్పంచులు మరమ్మతులు చేయించి తాత్కాలికంగా సమస్య నుంచి గట్టెక్కించేందుకు యత్నించేవారు. కొన్ని రోజులకే మళ్లీ రిపేర్‌కు వచ్చేవి. దీంతో శాశ్వత పరిష్కారం చూపేందుకు విఫలయత్నాలు చేసేవారు. వేసవిలో ఈ సమస్య మరింత జఠిలంగా మారేది. అయితే, ఇప్పుడు అలాంటి సమస్యకు మిషన్ భగీరథతో చెక్‌పడింది. నేరుగా ఇంటింటికీ నల్లాల ద్వారా కృష్ణమ్మ అమృత జలం చేరుతున్నది.