మహబూబ్నగర్, అక్టోబర్ 18: మహబూబ్నగర్- హైదరాబాద్- రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు విషయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అఖిపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుగా నమోదు చేసుకునేందుకు గత నెల 1న పబ్లిక్ నోటీస్ జారీ అయ్యిందన్నారు. నూతన ఓటరు దరఖాస్తులకు నవంబర్7 వరకు అవకాశం ఉందన్నారు. నవంబర్ 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారని, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు. 30న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మహబూబ్నగర్- హైదరాబాద్- రంగారెడ్డి నియోజకవర్గాల్లో నవంబర్ 1,2022 ముందు కనీసం ఆరు సంవత్సరాలు నివాసం ఉండి ఉండాలని, ప్రజాప్రతినిధ్య చట్టం -1950లో పేర్కొన్న విధంగా ఏదేని విద్యా సంస్థలో కనీసం 3సంవత్సరాలు పనిచేసి ఉండాలని వెల్లడించారు. ఎన్నికలకు ఏఈఆర్వోగా మహబూబ్నగర్ ఆర్డీవో ఉంటారన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, వివిధ పార్టీల నేతలు సాయిబాబా, అంజయ్య, రవీందర్రెడ్డి, లక్ష్మయ్య, కిల్లెగోపాల్, సత్యంయాదవ్, సాదతుల్లా, రామ్మోహన్ ఉన్నారు.