మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 15 : అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న శంకర్‌దాదాలు, ప్రైవేట్ దవాఖానలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రై వేట్ దవాఖానలు, ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్‌లతోపాటు మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లను తనిఖీ చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. నిబంధనలు పాటించని, గుర్తింపులేని ప్రైవేట్ దవాఖానలను వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేస్తున్నది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 263 దవాఖానల్లో అధికారులు తనిఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో గుర్తింపు లేకుండా, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న 61 దవాఖానలను సీజ్ చేశారు. 88 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో ఐదింటికి జరిమానా విధించారు.
రూ.లక్షలో అక్రమార్జన..
జిల్లాలో ఎంతోమంది అర్హత లేకున్నా.. కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ దవాఖానలు, క్లినిక్‌లు ఏర్పాటు చేసి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ప్రథమ చికిత్సకే పరిమి తం కావాల్సిన ఆర్ఎంపీలు అమాయక ప్రజలకు యాంటీబయాటిక్స్ రాసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత లేనివారు వైద్యం చేసి పలువు రి మృతికి కారణమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ప్రభుత్వ ఆదేశాలతోనే అధికారుల్లో చలనం వచ్చి తనిఖీలు చేస్తున్నారని, ఎన్నో ఏండ్లుగా అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై ఉదాసీనంగా వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రోగుల ప్రాణాలు తీసిన ఎన్నో సందర్భాల్లో జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పా పాన పోలేదని ఆరోపిస్తున్నారు.
అనధికారంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్ హోంలపై మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్ర కారం చర్యలు తీసుకునేందుకు కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో గతంలో సమావేశాలు నిర్వహించారు. కాగా, తనిఖీలు నిర్వహించేందుకు మూడు డివిజిన్ స్థాయి బృందాలు ఏర్పాటు చేశారు. ఇందులో వైద్యశాఖ నుంచి డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఆర్డీవో, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్లను సభ్యులుగా నియమించి తనిఖీలు నిర్వహించారు.
నిర్వాహకుల దాగుడుమూతలు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల నుంచి తప్పించుకునేందు కు అర్హతలేని ఆర్ఎంపీలు, ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు అష్టకష్టాలు పడుతున్నారు. తనిఖీ బృందాలు వచ్చిన సమయంలో వాటిని మూసివేసి, అధికారులు వెళ్లిపోయిన త ర్వాత తెరుస్తున్నారు. చాలా ఏండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ దవాఖానలు, అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటారా.. లేదా హడావిడి చేసి తర్వాత మిన్నంకుండిపోతారా అన్నది వేచి చూడాల్సిందే.
నిబంధనలు పాటించకుంటే సీజ్..
జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అనుమతులు లేని దవాఖానలు, క్లినిక్‌లను గుర్తించి సీజ్ చేస్తున్నాం. ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతి గ్యాప్ పీరియడ్‌కు రూ.50వేల వరకు జరిమానా విధిస్తాం. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారమే ప్రైవేట్ దవాఖానలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది.
– డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్‌వో, మహబూబ్‌నగర్
దోచుకుంటున్న ప్రైవేట్ దవాఖానలు..
జ్వరం వచ్చిందని ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే రూ.వేలల్లో బిల్లులు వసూలు చేసి దోచుకుంటున్నారు. అవసరం ఉన్న లేకున్నా పరీక్షల పేరుతో జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రైవేట్ దవాఖానలు, ఆర్ఎంపీలపై దృష్టి సారించి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటుండడం శుభపరిణామం. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల వైద్యసేవలు ఉచితంగా అందిస్తుండడంతో మాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుంది. – జె.రాముడు, పెబ్బేరు