కబ్జాలపై అధికారులు కన్నెర్ర చేశారు. మహబూబ్‌నగర్‌లోని నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన యజమానులపై కొరఢా ఝుళిపించనున్నారు. ఇటీవల పడిన భారీ వర్షాలతో పట్టణంలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. ఇండ్లల్లోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. జలమయమైన కాలనీల్లో పర్యటించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. శాటిలైట్ సాయంతో వరదకు చెక్ పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నాలాల విస్తరణకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారు. కాగా పట్టణంలోని పలు కాలనీలు వరద నుంచి ఇంకా తేరుకోలేదు. దీంతో నీటినంతా అధికారులు పెద్ద చెరువులోకి మళ్లించారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నాలాల కబ్జాలపై అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల తో వస్తున్న వరదలకు నాలాలపై వెలిసిన అ క్రమ నిర్మాణాలే కారణమని అధికారులు తే ల్చారు. ఈ క్రమంలో చర్యలు తీసుకునేందు కు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నా రు. వరద ముప్పు నుంచి జిల్లా కేంద్రాన్ని కాపాడేందుకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
అయితే, పెద్దచెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చి.. కేబుల్‌బ్రిడ్జి, శిల్పారామంతోపాటు లేజర్‌లైటింగ్, ఏయిర్‌బస్ హోటల్ ఏర్పాటుకు రూపకల్పన చే శారు. చెరువులో పనులకు ఆటంకంగా మారిన గుర్రపు డెక్కను తొలగించేందుకుగానూ నీటిని తోడివేశారు. పట్ట ణం నుంచి వస్తున్న మురుగునీటిని పెద్దచెరువుకు కాకుం డా వేరేచోటకు తరలించేందుకు ప్రత్యేక కాలువలను తవ్వా రు. ఈ పనులు జరుగుతున్న వేళ.. మూడు భారీ వర్షాలు కురిశాయి. ఎగువ నుంచి వరద తన్నుకు రావడంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. మళ్లీ వర్షం కురుస్తున్నది. అధికారులు తేరుకోకముందే భారీ వర్షాలు కురవడంతో కంటిమీద కునుకు లేకుండా పోతున్నది.
ఈ వరదలు ఇంజినీరింగ్ అధికారులకు సవాల్‌గా మారాయి. మరోవైపు జిల్లా కేంద్రంలో చేపట్టిన నాలుగులైన్ల జాతీయ రహదారి పను ల్లో భాగంగా చాలా చోట్ల కల్వర్టులను మూసేశారు. ఇవే ఇప్పుడు కొంపముంచాయి. జాతీయ రహదారుల శాఖకు కలెక్టర్ వెంకట్రావు తాఖీదులు ఇచ్చి.. ఇద్దరు అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా పాలమూరును శాశ్వతంగా వరద ముప్పు నుంచి కాపాడేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సీఎం కేసీఆర్‌ను కలిసి పరిస్థితి వివరించడం తో రూ.వంద కోట్లను కేటాయించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో వరద ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు అధికారులు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. చెరువులు, కుంటలు, ఇతర ప్రాంతాల నుంచి టౌన్లోకి వస్తున్న వరదను అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సెప్టెంబర్, అక్టోబర్‌లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తక్కువగా మూడు సెంటీమీటర్లు ఉన్నది. ఎంత వర్షం కురిసినా.. తట్టుకునేలా ప్రణాళికలు తయారుచేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు మాస్టర్‌ప్లాన్ ఖరారు చేస్తున్నారు. డ్రైనేజీల నీళ్లు ప్రత్యేకంగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణం విస్తరించకముందు ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్కడెక్కడ నాలాలు, పెద్ద డ్రైనేజీలు ఉన్నాయో గుర్తించి.. వాటిపై ఉన్న కబ్జాలను తొలగించేందుకే ఇంజినీరింగ్ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత నిబంధనలు పాటించకుండా కాలనీలు ఏర్పాటు చేసిన రియల్టర్లపై చర్యలు తీసుకొని.. ఆయా కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీళ్లు వెళ్లేందుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
మినీ ట్యాంక్‌బండ్.. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డ్రీమ్ ప్రాజెక్టు. దీనిని హైదరాబాద్ స్థాయిలో అభివృ ద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ట్యాంక్‌బండ్ చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉండేందుకు పట్టణంలోని మురుగునీరు చెరువులో కలవకుండా చేశారు. ఇందుకోసం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ద్వారా మురుగునీటిని బయటకు పంపించేందుకు ప్లాన్ తయారుచేస్తున్నారు. భవిష్యత్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ప్రత్యేక కాలువ నుంచి చెరువును నింపాలన్నదే మంత్రి కల. దీనికి అనుగుణంగానే అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనేక సమీక్షా సమావేశాలు జరిపాక బ్లూప్రింట్ సిద్ధం చేశారు.
కోదాడ నుంచి రాయిచూర్ వరకు ఉన్న జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా 120 ఫీట్ల రహదారికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జడ్చర్ల నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు నాలుగులైన్ల రహదారి.. డివైడర్, సెంట్రల్‌లైటింగ్, పచ్చని చెట్లు, పది ఫీట్ల ఫుట్‌పాత్, ఫుట్‌పాత్‌పై గ్రీనరీ ఏ ర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న చిన్నచిన్న కల్వర్టులను జాతీయ రహదారుల శాఖ ముసేసి రోడ్డును హైట్ పెంచింది. ఇదే పాలమూరు వరదలకు కారణమవుతున్న ది. అప్పన్నపల్లి బ్రిడ్జి నుంచి పీయూ వరకు పెద్ద పెద్ద నా లాలు మూడు ఉండగా, వాటిని పూడ్చేసింది. అబ్దుల్‌ఖాదర్ దర్గా, తూర్పు కమాన్, మేనకా థియేటర్, విజయమెహన్రెడ్డి పెట్రోల్‌బంక్ వద్ద ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయడంతో పెద్ద విపత్తు ఎదురైంది. దీంతో ఎర్రగుంట నీళ్లు ఎ టూ పోలేక జాతీయ రహదారిని ముంచెత్తే పరిస్థితి వచ్చిం ది.
అలాగే, పెద్ద చెరువుకు వెళ్లాల్సిన వరద నీటిని కలెక్టరేట్ వద్ద ఉన్న నాలాలోకి నేరుగా మళ్లించే ప్రయత్నం చేయకుండా.. క్రాస్ చేయడంతో కలెక్టరేట్‌ను ముంచెత్తుతున్నది. జెడ్పీ మైదానంలో వర్షం వస్తే చెరువులాగా మారుతున్నది. ఈ నీళ్లు వెళ్లేందుకు ఎల్లమ్మ టెంపుల్ పక్కన కల్వర్లు ఏ ర్పాటు చేయాల్సి ఉండగా.. దానిని నిర్లక్ష్యం చేయడంతో వర్షపు నీళ్లు జామ్ అవుతున్నాయి. ఇవన్నీ జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. దీంతో ఇం జినీర్ల నివేదికపై కలెక్టర్ వెంకట్రావు నేషనల్ హైవే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇద్దరు ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తమ్మీద పాలమూరులో వరదలు అధికారులకు పరీక్షగా మారాయి.