మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాల్లో కురుమూర్తి జాతరకు ప్రత్యేక స్థానం ఉందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్ప ష్టం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులతో కురుమూర్తి జాతర సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సకల సౌకర్యాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్‌తోపాటు జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి అవసరమైన మున్సిపల్ సిబ్బందిని వినియోగించుకోవాలని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలోనే కాకుండా అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి యువతను నియమించుకుని జాతర ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు.
ముఖ్యంగా మహిళలకు అవసరమైన సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలని, టాయిలెట్ల వద్ద నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎక్కడా ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఫైర్సెఫ్టీ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ మే రకు తమకు డ్రైవర్‌తోపాటు హోంగార్డులను సమకూర్చాలని సంబంధిత శాఖాధికారులు మంత్రిని కోరగా వెంటనే అగ్నిమాపక రాష్ట్ర ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఇద్దరూ డ్రైవర్లు, పది మంది సిబ్బందిని సమకూర్చాలని ఆదేశించారు. అనంతరం జాతర మహోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
రోడ్లపై గుంతలను పూడ్చాలి : ఎమ్మెల్యే ఆల
కురుమూర్తి జాతరకు వెళ్లే రోడ్డు మార్గాలు గుంతలమయంగా ఉన్నాయని సమస్య ను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. అధికారులు పూర్తిస్థాయిలో సమయం కేటాయించి అవసరమైన సదుపాయాలను ఎప్పటికప్పుడు కల్పించాలని సూచించారు. సీసీకుంట మండలంలో 13గ్రామాలకు సంబంధించి తాగునీరు కొంత ఇబ్బందిగా ఉందని, సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అవసరమైన వలంటీర్లను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు తేజస్‌నందలాల్‌పవర్, సీతారామారావు, జెడ్పీ సీఈవో జ్యోతి, డీపీవో వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.