తెలంగాణ ఏర్పడ్డాక గ్రంథాలయాలు పూర్వవైభవం సంతరించుకున్నాయి. ఉద్యోగ పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జి, హిస్టరీ పుస్తకాలు అందు బాటులో ఉన్నాయి. దీంతో ఉద్యోగార్థులకు ప్రయోజనకరంగా మారి స్టడీ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. ఉచిత వసతులు కల్పిస్తున్నారు. రూ.5కే అక్షయపాత్ర సౌజన్యంతో భోజనం అందిస్తున్నారు. దీంతో విజ్ఞాన సోపానాలుగా మారాయి.క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో మరింత అభివృద్ధి చెందుతున్నాయి
మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో గ్రంథాలయాల్లో చదువుకుందామంటే ఒక్క పుస్తకంకూడా అందుబాటులో ఉండేది కాదు. దానం చేసిన పుస్తకాలు మాత్రమే కనిపించేవి. గ్రంథాలయ భవనాలు వానొస్తే కురిసేవి. కుర్చీలు లేని పరిస్థితి. టేబుళ్లు, పుస్తకాలు బూజుపట్టి ఉండేవి. కానీ, నేడు పూర్తిగా మారింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిధులు భారీగా రావడంతో గ్రంథాలయ రూపురేఖలు మారిపోయాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో గ్రంథాలయాలను స్ట డీ సెంటర్లుగా తీర్చిదిద్దారు. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే అ భ్యర్థుల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. పుస్తకాలు, బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీరు, టా యిలెట్స్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతల సహకారం, మం త్రి, ఎమ్మెల్యే, ఎంపీ నిధులతో గ్రంథాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
లైబ్రరీల్లోని డిమాండ్ రిజిస్టర్లో ఫిర్యాదు చేస్తే చాలు.. మరుసటి రోజే వాటిని సమకూరుస్తున్నారు. కుర్చీలు, రీడింగ్ ప్యాడ్స్, పుస్తకాలు ఇలా ఏవి కావాలన్నా ఠక్కున అరేంజ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అక్షయ పాత్ర ద్వారా రూ.5లకే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అన్ని వసతులు ఉండడంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల కన్నా చదువుకునేందుకు లైబ్రరీల వైపే మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం పెంచేందుకు డిస్టిక్ ఎంపవర్మెంట్ కింద 200 మందికి క్రాష్ కోర్సులు నేర్పిస్తున్నారు. మిగతా లైబ్రరీలకు కూడా పక్కా భవనాల కోసం సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించారు.
స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రంథాలయాల పాత్ర అమోఘం. మేధావులు, ఉద్యమకారులను కలిపే కేంద్రాలుగా అవి పనిచేశాయి. రానురానూ గ్రంథాలయాల నిర్వహణ భారం కావడంతో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అప్పుడప్పుడూ కనిపించే దినపత్రికలు, బూజుపట్టిన అల్మారాల్లో కుక్కిన విలువైన పుస్తకాలు దర్శనమిచ్చేవి. దినపత్రికల బిల్లులు కూడా చెల్లించకపోయేవారు. కానీ, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పరిస్థితులు మారాయి. ఉద్యోగార్థులు, పుస్తకప్రియులు గ్రంథాలయాలవైపు పరుగులు పెడుతున్నారు. పాతవాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి ని ధులు సమకూర్చడం, మున్సిపాలిటీ, ఇతర శాఖల నుంచి రావాల్సిన సెస్‌ను నెల నెలా అందేలా చేయడంతో లైబ్రరీల రూపురేఖలు మారాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రాంమందిర్ లైబ్రరీకి మహర్దశ చేకూరింది. రాజారామ్మోహన్రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా రూ.53 లక్షలు, కానిస్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.45 లక్షలు వెచ్చించి ఆధునిక భవనం, పార్కింగ్, పుస్తక పఠనానికి ప్రత్యేక హాల్ వంటి వసతులు కల్పించారు. నారాయణపేటలో రూ.5లక్షల ఎంపీ ల్యా డ్స్ ఫండ్స్‌తో, కోస్గిలో రూ.6 లక్షల నియోజకవర్గ అభివృద్ధి ని ధులతో గ్రంథాలయాలను ఆధునీకరించారు. జడ్చర్లలో లైబ్రరీ ఆధునీకరణకు రూ.12 లక్షలు, లైబ్రరీ జనరల్‌ఫండ్ నుంచి రూ.18 లక్షలు వెచ్చించి పరిస్థితిని మార్చారు. దేవరకద్రలో రూ.38లక్షలతో కొత్త భవనాన్ని నిర్మించారు. కోయిలకొండ, హన్వాడలలో కొత్త భవనాలు కట్టించారు. వెన్నచేడ్‌లో రూ.15 లక్షలతో మరమ్మతులు చే యించారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి చదువుకునే వారి కోసం ఏదో ఒకటి చేయాలని తలంచా. ఉన్న దాంట్లోనే సర్దుకొని పూర్వవైభవం తీసుకురావాలని నిధుల సమీకరణపై దృష్టి సారించాను. ప్రభుత్వ శాఖల ద్వారా వచ్చే సెస్‌లో రూపాయి కూడా వదలకుండా వసూలు చేయిస్తున్నాం. ఆ నిధులతో భవనాలు, సదుపాయలు కల్పించాను. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గ్రంథాలయాలకు ఉద్యోగార్థులు చాలా మంది క్యూ కడుతున్నారు. ఇక్కడ చదువుకున్న వారు గ్రూప్-1, కానిస్టేబుల్, ఉపాధ్యాయుల కొలువులు సాధించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేల సహకారంతో గ్రంథాలయాలకు కొత్త భవనాలు నిర్మించాం. నా చాంబర్‌ను కూడా విద్యార్థులకు కేటాయించాను.
– భుజగౌని రాజేశ్వర్‌గౌడ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్, మహబూబ్‌నగర్