హన్వాడ/మహబూబ్‌నగర్, అక్టోబర్ 7 : దివ్యాంగుడిపై సర్పంచ్ దాడికి పాల్పడిన ఘటన హన్వాడ మండలం పుల్పోనిపల్లిలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధి హామీ కూలిడబ్బులు సక్రమంగా రావడంలేదని, ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియజేయాలని పుల్పోనిపల్లికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య ఇటీవల మండల అధికారులకు సమాచార హక్కుచట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నా డు. అయితే విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీనివాసులు గురువా రం సాయంత్రం కృష్ణయ్య ఇంటికెళ్లి అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అడిగారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి దివ్యాంగుడు కృష్ణయ్యపై సర్పంచ్ దాడికి పాల్పడ్డాడు. అయితే దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఎస్పీ స్పందించారు. వెంటనే సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని స్థానిక ఎస్సై రవినాయక్‌ను ఆదేశించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, సర్పంచ్ విధుల నుంచి శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. అలాగే దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిషత్, తాసిల్దార్ కార్యాలయాల ఎదుట శుక్రవారం నిరసన తెలియజేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, ప్రధానకార్యదర్శి భిక్షానాయక్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, వీరేశ్, మునయ్య, నర్సింహులు, రాములు, శ్రీనివాసులు, కృష్ణయ్య, వెంకటేశ్, మద్దూ, రవి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.