ఉమ్మడి జిల్లాలో వర్షం జలఖడ్గాన్ని ఝులిపించింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు వాన దంచికొట్టింది. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలు, రహదారులు కుంటల్లా మారాయి. ఇండ్లల్లోకి నీరు చేరింది. చెరువులకు గండ్లు పడ్డాయి. దుందుభీ, ఊకచెట్టువాగులు ఉప్పొంగి ప్రవహించాయి. కల్వర్టులపై నుంచి వరద పారడంతో పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. సరళాసాగర్ సైఫన్లు తెరుచుకోగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, సంగంబండ రిజర్వాయర్ గేట్లను అధికారులు తెరిచారు. కాగా పాలమూరులో వర్షం బీభత్సం సృష్టించింది. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు అధికారులు వరద ప్రాంతాల్లో పర్యటించారు. వరద నుంచి శాశ్వత పరిష్కారం చూపుతామని, ప్రజలు ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను మరోసారి వర్షాలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొల్లాపూర్ సమీపంలో నార్లాపూర్ ఎర్రగట్టు పెద్దవాగు భారీగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దుందుభీ, ఊకచెట్టువాగుల్లో వరద ప్రవాహం పెరిగిపోయింది. చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు అలుగు పారుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల వర్షాలకు ఇండ్లు కూలిపోయాయి. కోయిలకొండ మండలంలోని దామయపల్లి, ఆచార్యపూర్ మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద పారుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఊకచెట్టువాగు, కందూరు వాగులు పొంగిపొర్లుతుండడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులోకి భారీగా వరద రావడంతో రామయ్యబౌళి, శివశక్తినగర్, బీకే రెడ్డి కాలనీలు మళ్లీ వరద ముంపునకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లో రహదారులపై వరద భారీగా పారుతుండడంతో జనజీవనం స్తంభించింది. అనేక వాహనాలు నీట మునిగాయి. కొన్ని బైకులు కొట్టుకుపోయాయి. రహదారులన్నీ కాలువలను తలపించాయి. ఎర్రకుంటకు భారీ వరద రావడంతో వల్లభ్‌నగర్, గణేశ్నగర్ను వరద నీళ్లు ముంచెత్తాయి.
రాయిచూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నీరు పారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కురివిశెట్టి కాలనీ, బీకేరెడ్డి కాలనీ, శ్రీనివాసకాలనీ ఇండ్లలోకి వరద నీళ్లు చేరాయి. మోకాలు లోతు నీళ్లు చేరుకున్నాయి. కాగా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు కాసేపు ఆందోళనకు దిగారు. కలెక్టర్ వెంకట్రావు అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని కమిషనర్‌కు సూచించారు. వరద నీళ్లు ముంచెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. మహబూబ్‌నగర్‌లో వరద పరిస్థితిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులకు భారీ వరద..
దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కు భారీ వరద వస్తుండడంతో ఐదు గేట్లు ఎ త్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగంబండ పెద్దవాగుకు వరద వస్తుండడంతో మూడు గేట్లు ఎత్తారు. సరళాసాగర్‌లో ఆటోమెటిక్ సైఫన్ గేట్లు తెరుచుకున్నాయి. దీంతో సమీప గ్రామాల్లోని కాజ్‌వేపై వరద ప్రవహిస్తున్నది. కొత్తకోట-ఆత్మకూర్ మధ్య కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి.