మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 25: అన్ని రకాల రక్త పరీక్షలు చేయాలని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌లో పనిచేసే వైద్య సిబ్బందిని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మొహంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆవరణలోని తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హబ్‌లో ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు, ప్రతి రోజు ఎన్ని రక్త పరీక్షలు శాంపిల్స్ వస్తున్నాయి, అన్ని పీహెచ్‌సీల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారా? పరీక్షల రిపోర్టులు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారా..? అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రిపోర్టులు సరిగ్గా లేవని డాటా ఎంట్రీ ఆపరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 56రకాల రక్త పరీక్షలు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఖరీదైనా పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జీవన్, డాక్టర్ రాధ, అడిషనల్ డీఎంహెచ్‌వో డా. శశికాంత్, డాక్టర్ రఫీక్, ఏవో భాస్కర్ నాయక్, డెమో అధికారి డాక్టర్ తిరుపతిరావు ఉన్నారు.
అచ్చంపేట, ఆగస్టు 25: గర్భిణులు రక్తహీనతతో ఇబ్బంది పడకుండా ముందుగానే సమస్యను గుర్తించి సుఖప్రసవం అయ్యే విధంగా బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ శ్వేతామొహంతి అన్నారు. గురువారం అచ్చంపేటలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఆమె సందర్శించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అదనపు కలెక్టర్ మనూచౌదరి, డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, ఇన్చార్జి డీటీడీవో అనిల్‌ప్రకాశ్, ఆర్డీవో పాండునాయక్, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, డాక్టర్లు పుష్పగుచ్ఛం అందజేసి ఆమెకు స్వాగతం పలికారు.
అనంతరం పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రోగ్రాం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు పద్మజ, డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, ఆర్డీవో పాండు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, డిప్యూటీ వైద్యాధికారులు డాక్టర్ వెంకటదాసు, రమేశ్చంద్ర, సురేశ్‌బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.