ఖిల్లాఘణపురం, ఆగస్టు 25: పల్లెనిద్ర కార్యక్రమాలు రాష్ట్రంలో వనపర్తి జిల్లా ఒక నాంది అని, పల్లెనిద్ర చారిత్రాత్మకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మండలంలోని ఆముదంబండా, గార్లబండతండాలలో పల్లెనిద్ర కార్యక్రమాలు చేపట్టిన ఆయన గురువారం ఉదయం తండాల్లో మార్నింగ్ వాక్ చేసి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను నేరుగా తండావాసులే అభివృద్ధి చేసకునే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారన్నారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక సాగునీరు పుష్కలంగా వచ్చిందని, సాగునీరు లేక వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పల్లెనిద్ర కార్యక్రమంలో 50 శాఖల అధికారులు పాల్గొని నేరుగా సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అధికారులు పర్యటించినప్పుడు అధికారులకు సహకరించి సమస్యలను వివరించి పరిష్కరించుకోవాలన్నారు. వజ్ర సంకల్పంలో భాగంగా ఆముదంబండతండా, గార్లబండ తండాల్లో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్ పాల్గొన్నారు.