మహబూబ్‌నగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : పరిపాలన ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల సేవలు ఒకేచోట తీసుకురావాలని, ప్రజలకు ఒకే వద్ద అధికారులంతా అందుబాటులో ఉండాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత నూతన కలెక్టరేట్ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. వనపర్తిలో ఐదు నెలల కిందటే నూతన కలెక్టరేట్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కాగా, మహబూబ్‌నగర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో పనులు తుదిదశకు చేరగా, నాగర్‌కర్నూల్‌లో పనులు ఊపందుకున్నాయి. నారాయణపేటలో సుమారు 30ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. దీంతో నూతన కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.
స్వరాష్ట్రంలో ప్రజలకు పాలనను మరింత చే రువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. 64 మండలాలతో ఇటు కొత్తూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు.. అటు కొడంగల్ నుంచి దోమలపెంట వరకు కర్ణాటక, ఏపీ, మహరాష్ట్ర సరిహద్దులను పంచుకొని విశాలంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణ రాకతో స్వరూపమే మారిపోయింది. మారుమూల మండలాల నుంచి జిల్లా కేంద్రానికి రావాలంటే దాదాపుగా ఐదు గంటలు పట్టేది. తెల్లా రి మొదటి బస్సు పట్టుకొని వచ్చేవారు. ఇక్కడికి వచ్చాక తిండి తిప్పలకు ఇబ్బందులు పడేవారు. అంతదూరం వచ్చాక అధికారి లేకుంటే వారి పరిస్థితి వర్ణణాతీతం. ఈ బా ధలన్నింటినీ గుర్తించిన తెలంగాణ సర్కార్ ఐదు జిల్లాలుగా విభజించింది. దీంతో పాలన చేరువైంది. గంట, గంటన్నర ప్రయాణంలోనే జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నారు. పొద్దుపోకముందే ఇంటికి చేరుకుంటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించింది. దీంతో కొత్త జిల్లాలైన మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ రూపురేఖలు మారుతున్నాయి. శరవేగంగా అ భివృద్ధి జరుగుతున్నది. రహదారుల విస్తరణ చేపట్టారు. జిల్లా కేంద్రాల చుట్టూ భూముల ధరలకు రెక్కలొచ్చా యి. ఆయా జిల్లాల్లో అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత భవనాలను నిర్మిస్తున్నది. దీంతో ఐదు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం జోరందుకున్నది. వనపర్తిలో ఐదు నెలల కిందట సీఎం కేసీఆర్ ప్రారంభించా రు. మహబూబ్‌నగర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో పనులు తుదిదశ కు చేరుకోగా, నాగర్‌కర్నూల్‌లో పనులు జరుగుతున్నా యి. నారాయణపేటలో సుమారు 30 ఎకరాల ప్రభు త్వ భూమిని కేటాయించారు. దీంతో ఆయా జిల్లాల్లో కలెక్టరేట్ల సమీపంలో పెద్దపెద్ద టౌన్‌షిప్‌లను తలదన్నేలా కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. రహదారుల చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్‌లు వెలుస్తున్నాయి.
కలెక్టరేట్లకు కొంగొత్త హంగులు..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సుమారు 25 ఎకరాల్లో కలెక్టరేట్ భవన సముదాయం నిర్మించారు. కొం గొత్త హంగులతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా అర్బన్ మండలం పాలకొండ వద్ద ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించారు. సుమారు 60 శాఖలు కలెక్టరేట్లో కొలువుదీరనున్నాయి. విశాలమైన రహదారులు, పార్కింగ్, పెద్ద పెద్ద లాన్లు, కలెక్టరేట్ వెనుక హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో ఆయా డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమయ్యేందుకు మినీ కాన్ఫరెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్లో అధికారులందరితో సమావేశమయ్యేలా పెద్ద మీటింగ్ హాల్ నిర్మించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది. కలెక్టరేట్లో పనిచేసే మహిళా ఉద్యోగులు పిల్లలతో డ్యూటీకి వస్తే.. వారి కోసం ప్రత్యేకంగా బేబీ కేర్ హాల్ నిర్మించా రు. కొత్త కలెక్టరేట్ చుటూ పచ్చదనం ఉట్టిపడేలా మం త్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ వెంకట్రావు చొరవ చూపారు. గేట్ వద్ద ఉన్న గార్డెన్లో రకారకాల మొక్కలను పెంచుతున్నారు. ప్రతి ఫ్లోర్లో లాన్లను సుందరంగా ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయి. కార్పొరేట్ స్థాయిలో కలెక్టరేట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఉన్నది.
భూముల ధరలకు రెక్కలు..
పాలమూరు కలెక్టరేట్‌ను నిర్మిస్తున్న భూత్పూర్ రహదారి గుర్తుపట్టని విధంగా డెవలప్ అవుతున్నది. క్రిష్టియన్‌పల్లి నుంచి అమిస్తాపూర్ వరకు పెద్దపెద్ద టౌన్‌షిప్‌లు వెలుస్తున్నాయి. గతంలో తక్కువ ధరకు ఉన్న భూ ములు ఇప్పుడు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. దాదాపుగా నాలుగు కిలోమీటర్ల వరకు కమర్షియల్ కాంప్లెక్స్ ల నిర్మాణం జోరందుకున్నది. రూ.5వేల లోపు గజం ఉన్న భూములు ఏకంగా రూ.25 వేలకు చేరుకున్నాయి. రోడ్‌సైడ్ గజం రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్నది. ఇప్పటికే బైపాస్ వచ్చేసింది. మరోవైపు భారత్‌మాల వస్తే ఈ చుట్టుపక్కల భూముల ధరలు ఊహించడం కష్టం అని రియల్టర్లు అంటున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో నిర్మించిన కలెక్టరేట్ చుట్టూ వేగంగా అభివృద్ధి జరుగుతున్నది. నాగర్‌కర్నూల్‌లో కూ డా ఇదే స్థాయిలో ఉన్నది. నారాయణపేటలో స్థలం కే టాయించగానే.. భూముల ధరలు అమాం తం పెరిగాయి.
వనపర్తిలో ప్రారంభం..
వనపర్తి జిల్లా కేంద్రంలో మార్చి 8న సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌ను ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో భవన సముదాయం తొందరగా పూర్తయ్యేందుకు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రారంభోత్సవం కాగానే కలెక్టర్‌తోపాటు 46 శాఖల అధికారులు ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ ముందు పెద్దగార్డెనింగ్ ఏర్పాటు చేశారు. 25 ఎకరాల్లో కలెక్టరేట్‌ను నిర్మించారు.
జోగుళాంబ గద్వాలలో తుది దశకు..
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంపు పరిసరాల్లో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ తుదిదశకు చేరుకున్నది. జూరాల ప్రాజెక్టు నిర్మించే సమయంలో ఏర్పాటు చేసిన నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో ప్రస్తు తం ఆయా శాఖల అధికారులు విధులు చేపడుతున్నారు.
సింగారం చౌరస్తాలో 30 ఎకరాలు..
ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి కృషితో నారాయణపేట కొత్త జిల్లాగా ఆవిర్భవించింది. 2019 ఫిబ్రవరిలో రెండోసారి అధికారంలో వచ్చాక టీఆర్ఎస్ సర్కార్ నారాయణపేటను జిల్లాగా ప్రకటించింది. కొత్త కలెక్టరేట్ కోసం నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించారు. ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తెలిపారు.
నాగర్‌కర్నూల్‌లో చురుకుగా..
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 23 : నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ పను లు చురుకుగా జరుగుతున్నాయి. రూ.52 కోట్లతో కొల్లాపూర్ చౌరస్తాలో నాలుగు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే లా కలెక్టరేట్ పనులను నాలుగేండ్ల కిందట ప్రారంభించారు. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. అయితే, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ పెరగడంతో భవన నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పనులను పరిశీలిస్తూ వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.30 కోట్ల పనులు పూర్తయ్యాయి. దసరా నాటికి పనులు పూర్తి చేసేలా ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.
అన్ని సౌకర్యాలు కల్పించాం..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చొరవతో మహబూబ్‌నగర్ కలెక్టరేట్ అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్నది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. మూడు అంతస్తుల్లో ఆధునిక హంగులు కల్పించాం. ప్రతి ఫ్లోర్లో చక్కటి కార్యాలయాల గదులు, లాన్లు ఉన్నాయి. 60 శాఖలు ఒకే దగ్గర కొలువుదీరనున్నాయి. అధికారులు మీటింగ్ పెట్టుకునేందుకు కాన్ఫరెన్స్ హాళ్లు, 500 మంది అధికారులు కూర్చునేలా పెద్ద మీటింగ్ హాల్ సిద్ధమైంది. ఎక్కడా లేని విధంగా హెలీప్యాడ్ కూడా ఉన్నది.
– ఎస్.వెంకట్రావు, కలెక్టర్, మహబూబ్‌నగర్