మిడ్జిల్, ఆగస్టు 22 : అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జిల్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 98మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా 18మందికి రూ.10లక్షల 50వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అండగా నిలుస్తున్నదని తెలిపారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. జన్‌ధన్ ఖాతాదారులకు రూ.15లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా వేయలేదని వి మర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి నిత్యావసర సరుకుల ధరల పెంపునకు కారణమయ్యాడన్నారు. గతంలో సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1150కి చేరిందన్నారు.
బడా పారిశ్రామికవేత్తలకు పెద్దమొత్తంలో బ్యాంకు రుణాలను మాఫీ చేయగా, రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోవడమేకాకుండా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధం కావడం దారుణమన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో పింఛన్ రూ.600 ఉంటే మన రాష్ట్రంలో రూ. 2016 ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు బీమా, పంట పెట్టుబడిసాయం, 24గంటల విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. అందరి అభ్యున్నతికి పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. మాయమాటలకు మోసపోతే తెలంగాణను ఆగం చేస్తారని తెలిపారు. అనంతరం వెలుగొమ్ములలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, వైస్‌ఎంపీపీ తిరుపతమ్మ, తాసిల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ రాధికారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, ఎం పీటీసీ సుదర్శన్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగిరెడ్డి, నాయకలు సుధాబాల్రెడ్డి, జైపాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, బాలు, నిరంజన్, శివప్రసాద్, వెంకట్‌రెడ్డి, బాబా, రఫి, బాలయ్య, భాస్కర్, భీంరాజు, బంగారు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా జడ్చర్లలోని హౌసింగ్‌బోర్డుకాలనీ వృద్ధాశ్రమం ఆవరణలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 8నుంచి 22వ తేదీవరకు అన్ని గ్రామాల్లో స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య కూతురు విశ్వవాణి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే చేతులమీదుగా ఆశ్రమంలోని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని పెద్ద ఆదిరాల ఉన్నత పాఠశాల విద్యార్థులు మానవహారం నిర్వహించి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.